MLA Pratap Bheel : ఉద్యోగాల పేరుతో అత్యాచారం.. పది నెలల్లో రెండో లైంగిక దాడి కేసు.. !

MLA Pratap Bheel : రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్‌పై 10 నెలల్లో రెండోసారి అత్యాచారం కేసు నమోదైంది. అయితే ఈ రెండు కేసుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి, పెళ్లి పేరుతో వంచించి అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధిత మహిళలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ఓ మహిళ అంబామాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని ఆశ్రయించి, ఉద్యోగం ఇప్పిస్తానని ప్రతాప్ భీల్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.
గత రెండేళ్లుగా ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడని, ఇటీవల ఉపఎన్నికల తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, అయితే పెళ్లి చేసుకోకుండా ఎమ్మెల్యే తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన ప్రైవేట్ సిబ్బంది కూడా తనను బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. కేసు ఎమ్మెల్యేకు సంబంధించినది కావడంతో బాధితురాలి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును సీఐడీ క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు.
అయితే ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. బాధితురాలు తనకు తెలియదని చెప్పారు. కాగా దీనికిముందు సుఖేర్‌లో 10 నెలల క్రితం (ఈ ఏడాది ఫిబ్రవరిలో)ఎమ్మెల్యేపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ పైన అత్యాచారం చేసినట్టుగా కేసు నమోదైంది. ఈ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. కాగా ప్రతాప్ భీల్ రాజస్థాన్‌లోని గోగుండా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com