రజనీకాంత్ పార్టీతో పొత్తు గురించి కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు

రజనీకాంత్ పార్టీతో పొత్తు గురించి కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ చూసినా రజనీకాంత్ గురించి చర్చే. రజని పార్టీ పేరు ఇదే.. పార్టీ గుర్తు ఇదేనని రోజుకో వార్త తెరపైకి వస్తోంది. తాజాగా రజనీ పార్టీ పేరు మక్కల్ సేవై కట్చి అని.. పార్టీ ఎన్నికల గుర్తుగా ఆటో రిక్షాను ఖారారుచేసినట్లు కూడా వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే పార్టీ పేరు, గుర్తు, జెండా, విధివిధానాలు రజనీకాంత్ ఈనెల 31న ప్రకటించనున్నారు.

మక్కల్ సేవై కట్చి అంటే ప్రజా సేవ పార్టీ అని అర్థం. ఆటో రిక్షాను ఎన్నికల గుర్తుగా కేటాయిస్తారన్న వార్తలతో రజనీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది ఆటోనేనని, మాస్‌ను ఆకట్టుకుంటుందని చెప్పుకుంటున్నారు. పైగా బాషా సినిమాలో రజినీకాంత్ ఆటోడ్రైవర్‌గా నటించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

రజనీ పార్టీ గుర్తుగా బాబా ముద్రను కేటాయించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. కాని, నిబంధనల ప్రకారం ఈసీ దీనికి అంగీకరించలేదు. బాబా ముద్రకు బదులుగా ఆటోను కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే మక్కల్ శక్తి కజగం పేరుతో పార్టీ పెట్టాలనుకున్నారు. కాని, కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని కూడా తిరస్కరించినట్లు తమిళ మీడియా చెబుతోంది.

మరోవైపు ఇప్పటికే, క్షేత్రస్థాయిలో రజనీ పార్టీ పనులు కూడా జరుగుతున్నాయి. 38 జిల్లాలకు అభిమాన సంఘం అధ్యక్షులనే ప్రజా సేవ పార్టీ ప్రెసిడెంట్లుగా నియామించనున్నారని తెలుస్తోంది. జర్నలిస్టులు, వైద్యులు, స్వచ్ఛంద సేవా సంస్థల్లో పనిచేస్తున్న వారికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని రజనీ నిర్ణయించుకున్నారు. ఇతర పార్టీల నేతలను ఇప్పుడే తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు రజనీకాంత్.

ఇదిలా ఉంటే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తమ మధ్య ఎలాంటి విబేధాలున్న ప్రజల సంక్షేమం కోసం రజనీతో కలుస్తానన్ని కమల్ స్పష్టంచేశారు.

మొత్తమ్మీద రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags

Next Story