సాగు చట్టాలపై రాజ్యసభలో దుమారం

సాగు చట్టాలపై రాజ్యసభలో దుమారం
రైతులు ఢిల్లీలోకి రాకుండా సరిహద్దుల్లో రోడ్డుపై మేకులు ఏర్పాటుచేయడంపై.. బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా మండిపడ్డారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో 2 నెలలకు పైగా ఆందోళన సాగిస్తున్న రైతులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును.. విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ అంశంపై.. రాజ్యసభలో విపక్షల సభ్యులు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఉదయం రాజ్యసభ సమావేశాలు ప్రారంభంకాగానే విపక్ష ఎంపీలు సాగు చట్టాల అంశాన్ని లేవనెత్తారు. ఆందోళన చేస్తున్న రైతులను ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఇప్పుడు రైతులు.. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారందరినీ కేంద్రం దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోందని.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని అవమానించడంపై యావత్ దేశం విచారం వ్యక్తం చేస్తోందన్నారు. అయితే ఆ ఘటనకు కారణమైన వారిని వదిలేసి రైతులను అరెస్టు చేయడం సరికాదన్నారు. జాతీయ జెండాను అవమానించిన దీప్‌ సిద్ధూ ఎక్కడున్నాడని ప్రశ్నించారు సంజయ్ రౌత్‌. ప్రభుత్వం ఆయనను ఎందుకు పట్టుకోలేకపోతోందని ప్రశ్నించారు. రైతుల ఆందోళనపై దుష్ప్రచారం చేయడం సరికాదని కేంద్రంపై మండిపడ్డారు.

రైతులు ఢిల్లీలోకి రాకుండా సరిహద్దుల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టడం.. రోడ్డుపై మేకులు ఏర్పాటుచేయడంపై.. బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా మండిపడ్డారు. ఇలాంటివన్నీ చైనా, పాకిస్థాన్‌ సరిహద్దులో చేయాల్సిందని.. అది కూడా మనదేశానికి మంచిదికాదన్నారు. గత రెండు నెలలుగా రోడ్డెక్కిన రైతుల్ని ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోందన్నారు. వారికి విద్యుత్‌, నీటి సరఫరా నిలిపివేయడం..మానవహక్కుల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం అహంకారాన్ని పక్కనబెట్టి రైతుల సమస్యలను విని.. సాగు చట్టాలను రద్దు చేయాలని సూచిస్తూ.. సర్కార్‌పై విరుచుకుపడ్డారు.


Tags

Read MoreRead Less
Next Story