Ramdev Baba: సహనం కోల్పోయిన బాబా.. నోర్మూసుకో అంటూ..

Ramdev Baba: అసలే ఎండాకాలం.. వాతావరణం వేడిగా ఉంది.. దానికి తోడు పెట్రోల్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి.. రాజకీయ నాయకులతో పాటు రాందేవ్ బాబాని కూడా ఇదే ప్రశ్న వేశారు మీడియా ప్రతినిధులు. పదే పదే అదే ప్రశ్నతో విసిగిస్తుండడంతో చిర్రెత్తుకొచ్చింది బాబాకి.. నోర్మూసుకో మళ్లీ అడిగితే బాగుండదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సహనం కోల్పోయిన బాబా.
హరియాణా రాష్ట్రంలోని కర్నాల్ లో జరిగిన కార్యక్రమంలో రామ్ దేవ్ బాబా పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ పాత్రికేయుడు బాబా గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. లీటర్ పెట్రోల్ రూ.40, గ్యాస్ సిలిండర్ రూ. 300 ఇచ్చే ప్రభుత్వాలనే పరిగణనలోకి తీసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. దాంతో బాబా.. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు.. నేనేమైనా నీ కాంట్రాక్టర్ నా.. నీకు సమాధానం ఇవ్వడానికి.. నోర్మూసుకో మళ్లీ ఇంకోసారి ఇదే ప్రశ్న అడిగావంటే బాగుండదు అని కించిత్ కోపాన్ని ప్రదర్శించారు బాబా.
వెంటనే సర్ధుకుని ధరలు పెరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో అందరూ కష్టపడి పనిచేయాలన్నారు.. చమురు ధరలు తగ్గితే పన్ను రాదని ప్రభుత్వం అంటోంది. ఆదాయం తగ్గితే జీతాలు ఎలా ఇవ్వాలి. రోడ్లు ఎలా వేయాలి, దేశాన్ని ఎలా నడిపించాలని ప్రశ్నిస్తోంది. అసలైతే పెట్రో ధరలు పెంచడం మంచిది కాదు.. నేను ఒప్పుకుంటా.. కానీ ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా శ్రమించాలి. నేను ఉదయం నాలుగు గంటలకు లేచి రాత్రి పది వరకు పని చేస్తాను అని చెప్పుకొచ్చారు బాబా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com