ఢిల్లీలో ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో గణతంత్ర వేడుకల్ని కొంతవరకు తగ్గించారు. ఈ ఏడాది ముఖ్య అతిథి ఎవరూ లేకుండానే రిపబ్లిక్ వేడుకల్ని నిర్వహించారు. రాజ్‌పథ్‌లో.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఉదయం 10 గంటలకు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత.. హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. రాష్ట్రపతికి 21 గన్స్ ఫైరింగ్‌తో సైనికులు వందనం సమర్పించారు.
అంతకు ముందు.. వార్ మెమోరియల్ వద్ద అమరజవాన్లకు ప్రధాని, త్రివిధ దళాల అధిపతులు నివాళులు అర్పించారు. సైనికుల సేవల్ని ప్రధాని మోదీ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మోదీతోపాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ రాజ్‌పథ్‌కు వెళ్లారు.
కరోనా పరిస్థితుల్లో.. 15 ఏళ్లకంటే చిన్నవారిని గణతంత్ర వేడుకల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించారు. అటు ప్రేక్షుకుల గాలరీలోనూ.. భౌతికదూరం ఉండేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించాక... సైనిక దళాల ప్రత్యేక గౌరవవందనం స్వీకరించారు. ఆ తర్వాత టీ 90 యుద్ధ ట్యాంకుల ప్రదర్శనతో పరేడ్ ప్రారంభమైంది.
ఆ తర్వాత గడ్వాల్, మహర్ రెజిమెంట్, జమ్ము కశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్, సిఖ్ లైట్ ఇన్‌ఫెంట్రీ, ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. సైనికుల కవాతు తర్వాత.. ఇండియన్ నేవీ బ్యాండ్.. రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది.
1955 నుంచి వరుసగా ప్రతీ ఏటా ఢిల్లీలో గణతంత్ర వేడుకల్ని నిర్వహిస్తున్నారు. సైనికుల కవాతు తర్వాత.. వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన జరిగింది. లద్దాఖ్, గుజరాత్, అస్సాం, ఒరిస్సా, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల శకటాల ప్రదర్శించారు.
ఆంధ్రపద్రేశ్ హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మందిర శకటం.. ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేకార్షణగా నిలిచింది. శకటంతోపాటు కళాకారులు నృత్యాలు చేసుకుంటూ ముందుకు సాగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com