విశాఖకూ ఏలూరు తరహా ముప్పు: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు

విశాఖకు ఏలూరు తరహా ముప్పు పొంచి ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ ద్వారా తెలియజేశానని అన్నారు. విశాఖ నగరంతో పాటు పట్టణాల్లో మంచి నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని, మంచినీటి వనరులు, పైపులైను వ్యవస్థలు, పైపులైన్లకు వినియోగించే పైపుల నాణ్యత మొదలైన పలు అంశాలు నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని ఆయన సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ఏలూరులో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని సీఎంతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలకు ఈ-మెయిల్‌లో లేఖలు పంపారు.
దేశంలోని 26 నగరాల్లో మోతాదుకు మించి సీసంతో కలుషితమైన నీరు సరఫరా అవుతోందని 'క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' (QCI) చేసిన అధ్యయనంలో తేలిందని లేఖలో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు/నగరపాలక సంస్థల్లో సీసం పూతతో తయారైన పైపుల వినియోగం కూడా నీరు విషతుల్యం కావడానికి కారణమవుతోందని శర్మ వ్యాఖ్యానించారు. నీటి కాలుష్యానికి కారణమవుతున్న పలు అంశాలపై లోతైన దర్యాప్తు చేయాలని సీఎం జగన్‌ను కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com