వాహనదారులపై నిఘా కఠినతరం..రూల్స్ బ్రేక్ చేస్తే..

Enforcement Road Safety: దేశంలో వాహనదారులపై ఇక నిఘా కఠినతరం కానుంది. ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యే జాతీయ, రాష్ట్ర రహదారులు, నగరాల్లోని కీలక కూడళ్లలో భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇలాంటి కూడళ్లు, రహదారులు ఇకపై ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డివైస్ పర్యవేక్షణలోకి రానున్నాయి. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా 132 నగరాలను, 10 లక్షల జనాభా దాటిన ప్రాంతాలను ఈ వ్యవస్థ పరిధిలోకి తెచ్చింది. వీటిలో తెలంగాణ నుంచి హైదరాబాద్, నల్గొండ, పటాన్‌చెరు, సంగారెడ్డి ఉన్నాయి. ఏపీలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరాలను గుర్తించారు. ఈ మేరకు కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
డ్రైవింగ్ సమయంలో ట్రాఫిక్ నియమావళి ఉల్లంఘించడం, వేగ నియంత్రణ, పార్కింగ్ నియమాలు పాటించకపోవడం వంటి అలసత్వ చర్యలకు పాల్పడే వాహనదారులను పకడ్బందీగా కట్టడి చేయడానికి ఎలక్ట్రానిక్ వ్యవస్థ దోహదపడుతుందని తెలిపింది. ఈ వ్యవస్థలో స్పీడ్ కెమెరా, సీసీ కెమెరా, స్పీడ్ గన్, బాడీ వేరేబుల్ కెమెరా, డ్యాష్‌బోర్డు కెమెరా, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్, వెయిట్-ఇన్-మెషీన్ మొదలైన అత్యాధునిక సాంకేతిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, రహదారులపై వాహనదారుల దృష్టికి ఆటంకం కలగని విధంగా ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఒకవేళ నియమాలను ఉల్లంఘించి, అదుపుతప్పి వాహనాలు నడిపితే.. ప్రాంతం, తేదీ, సమయం వంటి సమాచారం నమోదవుతుంది. ఈ సమాచారం ఆధారంగా డ్రైవింగ్‌లో అలసత్వం ప్రదర్శించిన వాహనదారులకు కేంద్ర మోటారు వాహన చట్టం, కేంద్ర మోటారు వాహన నిబంధనలు, రోడ్ సేఫ్టీ చట్టం మేరకు జరిమానాలు విధిస్తారు. నిర్దేశించిన వేగపరిమితిలో డ్రైవింగ్ చేయకపోతే సెక్షన్ 112, 183 కింద చర్యలు తీసుకుంటారు. అనధికార ప్రదేశంలో వాహనాలను పార్కింగ్ చేస్తే సెక్షన్ 122 కింద దండిస్తారు. వాహనం నడుపుతున్న వారితోపాటు వెనుక కూర్చునేవారు కూడా భద్రత చర్యలు పాటించాలి. లేదంటే సెక్షన్ 128 కింద చర్యలు తప్పవు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com