ఆఫర్ అదిరిందయ్యా.. థాలీ తింటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఫ్రీ అట

ఆఫర్ అదిరిందయ్యా.. థాలీ తింటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఫ్రీ అట
అందులో ఎంతో ఇష్టమైన నాన్ వెజ్.. ఫ్రీగా వచ్చిన బైక్ తీసుకుని ఊరంతా చుట్టేయొచ్చనుకుంటున్నారా.. అయితే థాలీలో కాలేసినట్లే..

ఫుడ్డే కదా ఎన్ని ప్లేట్లయినా లాగించొచ్చు.. అందులో ఎంతో ఇష్టమైన నాన్ వెజ్.. ఫ్రీగా వచ్చిన బైక్ తీసుకుని ఊరంతా చుట్టేయొచ్చనుకుంటున్నారా.. అయితే థాలీలో కాలేసినట్లే.. ఎందుకంటే ఇది మామూలు థాలీ కాదండి బాబు.. నాలుగు కేజీల థాలీ. గంటలో ప్లేట్ ఖాళీ చేయాలి. అప్పుడే మీ చేతికి బండి తాళాలు వస్తాయి. ఇంతకీ ఈ బంపరాఫర్ ఎక్కడనుకుంటున్నారు..

మహరాష్ట్ర పూణేలోని వడగావ్ మావల్ ఏరియాలో ఓ హోటల్ ఉంది. కరోనా సమయంలో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లు లాక్‌డౌన్ అనంతరం మళ్లీ హోటల్ ఓపెన్ చేశారు. ఆశించిన స్థాయిలో కస్టమర్లు రావట్లేదు. వ్యాపారం పుంజుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని ఆలోచించారు హోటల్ యజమాని.. బుర్రలోకి ఓ ఐడియా బుల్లెట్‌లా దూసుకొచ్చింది.

బుల్లెట్ థాలీ తింటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఫ్రీ అంటూ తెల్లారిపాటికి హోటల్ ముందు ఓ ఫ్లెక్సీ పెట్టించాడు. ఇక సవాలను స్వీకరించాలనుకునేవారు సింపుల్‌గా నాలుగు కేజీల థాలిని తింటే సరిపోతుంది. ఇందులో డ్రై మటన్, చికెన్ మసాలా, ప్రాన్స్ బిర్యానీ, చికెన్ తందూరీ, ఫ్రైడ్ ఫిష్, ఫ్రైడ్ సురమాయీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. ప్లేటు చూసి బ్యార్‌మనకుండా శుభ్రంగా ఒక్కొక్కటీ ఫినిష్ చేయాలి.

అందులో ఏ ఒక్కటి వదిలేసినా బైక్ మీది కాదు. ఈ బుల్లెట్ థాలీ ఛాలెంజ్‌‌లో పాల్గొనాలంటే రూ.2,500 చెల్లించాలి. హోటల్ ముందు పెట్టిన బైక్‌ని ఓ సారి తనవి తీరా చూసుకుని తినడం ప్రారంభిస్తున్నారు కస్టమర్లు. మరి ఎవరిని వరిస్తాయో చూడాలి ఈ బైక్‌లు.

Tags

Next Story