నేడు మోహన్ భగవత్ పుట్టిన రోజు.. ఆయన ఎలా పాపులర్ అయ్యారంటే..

నేడు మోహన్ భగవత్ పుట్టిన రోజు.. ఆయన ఎలా పాపులర్ అయ్యారంటే..
2017లో నాటి రాష్ట్రపతి భవన్‌లో .. RSS చీఫ్‌గా అధికారికంగా అడుగుపెట్టిన తొలి వ్యక్తి మోహన్ భగవత్

మోహన్ భగవత్‌... RSS అనే పేరు చెప్పగానే... అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ఇదే. RSS సర్‌ సంఘ్ చాలక్‌గా ఎందరో ప్రముఖులు పనిచేసినప్పటికీ... మోహన్ భగవత్‌ ప్రస్థానం ప్రత్యేకం. 2009లో కె. సుదర్శన్‌ తర్వాత... RSS చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు మోహన్ భగవత్‌. నాటి బాంబే రాష్ట్రంలోని చంద్రాపూర్‌లో సెప్టెంబర్ 11, 1950లో జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా.. RSSలోనే పనిచేయడంతో.. ఆ ప్రభావం చిన్నప్పటి నుంచి మోహన్ భగవత్‌పై బాగానే పడింది. నాగ్‌పూర్‌లో వెటర్నరీ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. పీజీ చదువు మధ్యలోనే మానేసి... RSSలో పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు. ఎమర్జెన్సీ పీరియడ్‌లో ఆయన చూపిన తెగువతో... మోహన్‌ భగవత్‌ బాగా పాపులర్ అయ్యారు 1977 నాటికి నాగ్‌పూర్, విదర్భ ప్రాంతాల ప్రచారక్‌గా ఎదిగారు. 1991 నుంచి 99 వరకు.. అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్‌గా ఉన్నారు. 2 వేల సంవత్సరంలో.. RSSకి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 2009లో పూర్తిస్థాయిలో ఆయనకు RSS బాధ్యతలు అప్పగించారు.

RSS అంటే అతివాద సంస్థగా ముద్ర ఉన్నప్పటికీ... అందులో మోహన్‌ భగవత్ చాలా ప్రత్యేకంగా కనిపించేవారు. RSS విధానాలపై స్పష్టంగా, నిక్కచ్చిగా వ్యవహరించిన ఘనత మోహన్ భగవత్ సొంతం. హిందుత్వ అతివాదిగా పైకి కనిపించినప్పటికీ... ఎంతో సౌమ్యుడిగా పేరుగాంచారు మోహన్ భగవత్‌. సమాజ శ్రేయస్సుకోసం RSS సిద్ధాంతాలతో ఎక్కడా రాజీ పడకుండా... అవసరమైన ప్రతీసారి దేశ శ్రేయస్సు కోసం గళాన్ని పెద్ద ఎత్తున వినిపించారు మోహన్ భగవత్‌. జాతీయ భావాలు బలంగా ఉన్న వ్యక్తిగా... దేశ ప్రయోజనాల కోసం... ఎలాంటివారినైనా బాహాటంగానే వ్యతిరేకించారాయన.

అయోధ్య రామ మందిర నిర్మాణంలోనూ... RSS పాత్ర ఎంతో కీలకమైనది. అప్పుడు కరసేవకులకు దిశానిర్దేశం చేసింది RSS. అటు కాశ్మీర్ అంశంలోనూ... గతంలో ఉన్న పరిస్థితులను తీవ్రంగా వ్యతిరేకించారు మోహన్‌ భగవత్‌. కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి అంశాలను... మోహన్‌ భగవత్‌ తీవ్రంగా వ్యతిరేకించేవారు. దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉండాలని బలంగా కోరేవారు. ఆర్టికల్‌ 371 రద్దు చేయాలని గట్టిగా నినదించారు మోహన్‌ భగవత్‌. ముస్లిం సమాజంలో ఉన్న పెద్ద సమస్య ట్రిపుల్‌ తలాఖ్‌ను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దాని వల్ల ముస్లిం మహిళలు పడుతున్న ఇబ్బందులను ఆయన తరుచుగా ప్రస్తావించేవారు.

RSS ఎల్లప్పుడూ.. ధర్మ సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముతుందంటారు మోహన్‌భగవత్‌. ఓ సిద్ధాంతానికి, అంశానికి మాత్రమే RSS మద్దతు పలుకుతుందని.. ఎన్నడూ ఏ పార్టీకి మద్దతిత్వలేదని మోహన్‌ భగవత్ స్పష్టంగా చెబుతారు. గతంలో ఎమర్జెన్సీని తాము వ్యతిరేకించిన సమయంలో.. ఆ అంశం ద్వారా అన్ని విపక్షాలు లబ్ధి పొందినట్లు మోహన్‌ భగవత్‌ గుర్తు చేస్తారు.

2015 జూన్‌లో పలు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతో ముప్పు ఉందన్న కారణంగా.. మోహన్‌ భగవత్‌కు Z + భద్రత కల్పిస్తోంది. 2017లో నాటి రాష్ట్రపతి భవన్‌లో .. RSS చీఫ్‌గా అధికారికంగా అడుగుపెట్టిన తొలి వ్యక్తికూడా ఆయనే.. ఇలా.. ఎన్నో ప్రత్యేకలతో జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా ఉన్న మోహన్ భగవత్‌.. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజున ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story