Sabarimala : ప్రసాదం నిలిపివేయండి.. కేరళ హైకోర్టు ఉత్తర్వులు

Sabarimala : ప్రసాదం నిలిపివేయండి.. కేరళ హైకోర్టు ఉత్తర్వులు
ప్రసాదం తయారీలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు; రసాయనాలు ఎక్కువగా ఉన్న యాలకులు వాడకం...

శబరిమల ఆలయ ప్రసాద పంపిణీని నిలిపి వేయాలంటూ కేరళ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇందుకుగాను బుధవారం 'ట్రావెన్‌కోర్ బోర్డుకు' ఉత్తర్వులు జారీచేసింది. ప్రసాదం తయారీలో రసాయనాలు ఎక్కువగా ఉన్న యాలకులు వాడుతున్నారని పేర్కొంది. జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ అనిల్ కె. నరేంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీచేసింది. ప్రసాదం తయారీలో ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని కోర్టు పేర్కొంది.

ప్రసాదంలో వినియోగించే యాలకులను ఆలయ ట్రావెన్‌కోర్ బోర్డు చాలాకాలం నుంచి 'అయ్యప్ప స్పైసెస్' అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసేది. 2022-23గాను కొల్లామ్ కు చెందిన ఓ సప్లయర్ కు యాలాకుల కాంట్రాక్ట్ ను బోర్డు అప్పగించింది. దీంతో సదరు కంపెనీ సరఫరా చేసిన యాలకులు విషపూరితమని 'అయ్యప్ప స్పైసెస్' కోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై విచారణకు ఆదేశించింది కోర్టు. భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ (FSSAI)యాలకులను టెస్ట్ చేయగా... యాలకుల్లో మోతాదుకు మించి విషపూరిత రసాయనాలు ఉన్నాయని తేలింది. దీంతో సదరు యాలకులతో తయారు చేసిన ప్రసాదాన్ని విక్రయించడం తక్షణమే నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. బుధవారం సాయంత్రం 4.45 గంటలకు ప్రసాద వితరణ నిలిచిపోవడంతో అయ్యప్ప స్వాములు ఒకింత నిరాశకు గురయ్యారు.

భద్రతా ప్రమాణాలు కలిగిన యాలకులతో అరవన పాయసాన్ని యుద్దప్రాతిపాదికన తయారు చేస్తున్నట్లు ట్రావెన్‌కోర్ అధ్యక్షుడు కె. అనంతగోపాలన్ తెలిపారు. బుధవారం రాత్రి నుంచే ప్రసాద ఉత్పత్తిని ప్రారంభించినట్లు చెప్పారు. గురువారం నుంచి అయ్యప్ప స్వామి భక్తులకు ప్రసాద పంపణీ జరుగనున్నట్లు ఆయన తెలిపారు. సంక్రాంతి దగ్గరలోనే ఉండటంతో ప్రసాదం గ్రహించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉందని అందుకు అనుగునంగానే... నాణ్యతమైన ప్రసాదాన్ని అందించనున్నామని చెప్పారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని కోర్టుకు ట్రావెన్‌కోర్ బోర్డు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story