రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన శశికళ

sasikala
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ. ఈ మేరకు ప్రకటన చేశారు. ఎన్నికల్లో డీఎంకేను ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనకు అధికార దాహం లేదని స్పష్టం చేశారు.
ఇటీవల జైలునుంచి విడుదలైన శశికళ.. తమిళనాడులో అడుగుపెట్టడంతోనే.. రాజకీయాలు వేడెక్కాయి. అప్పటిదాక అన్నాడీఎంకే, బీజేపీ కూటమి వర్సెస్ డీఎంకే - కాంగ్రెస్ కూటమి అనుకున్న పోటీ కాస్తా శశికళ రాకతో త్రిముఖ పోటీ తప్పదనుకున్నారు. ఆమె తిరిగి అన్నాడీఎంకేలోకి రావాలని కొందరు, వద్దని మరికొందరు నాయకులు వాదులాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి విజయవకాశాలకు చెక్ పడుతుందని అంతా భావించారు. డీఎంకేను ఓడించాలంటే...అన్నాడీఎంకే - బీజేపీ కూటమిలో ఐక్యత తప్పనిసరని బీజేపీ నేతలతో పాటు అన్నాడీఎంకే సీనియర్ నేతలు నిర్ణయించారు. ఈ సమయంలోనే... శశికళ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com