శశికళ విడుదలకు రంగం సిద్దం

తమిళనాడు మాజీ సీఎం దివంగత నాయకురాలు జయలలిత స్నేహితురాలు శశికళ విడుదలకు రంగం సిద్దమైంది. అక్రమార్జన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమె శిక్షాకాలం ముగియకముందే విడుదల కానున్నారు. సుప్రీంకోర్టు విధించిన పదికోట్ల జరిమానా వారంలోగా చెల్లించేందుకు శశికళ సిద్దమైనట్లు తెలిసింది. అక్రమ సంపాదన కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగు ఏళ్ల జైలుశిక్ష విధించింది. దీంతోఆమె బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకూ ఆమె జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే ఆమె సత్ప్రవర్తన కారణంగా జనవరి 27న శశికళను విడుదల చేసే అవకాశం ఉందని కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శశికళ తరపున 10 కోట్ల జరిమాన సొమ్మును కర్నాటక కోర్టులో చెల్లించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు సిద్దమయ్యారు. ప్రస్తుతం దీపావళి సెలవుల తర్వాత కర్నాటకలో కోర్టులన్నీ పునఃప్రారంభమయ్యాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శశికళ విడుదల అక్కడి రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com