అదిగో...లాక్‌డౌన్ మళ్లీ వచ్చేస్తోంది..

అదిగో...లాక్‌డౌన్ మళ్లీ వచ్చేస్తోంది..

రోజువారీ కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంటే, సమస్యకి అదొక్కటే పరిష్కారం కాకపోయినా, సరే మళ్లీ అదే బాట పట్టకతప్పని పరిస్థితి. దీంతో తిరిగి మహారాష్ట్రలో లాక్‌డౌన్‌కి ఏర్పాట్లు వేగంగా జరిగిపోతున్నాయ్. ఇందుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రే పాలనాయంత్రాంగాన్ని ఆదేశించారు.

ఆదివారంతో ఇక్కడ నైట్ కర్ఫ్యూ ప్రారంభం అవుతుండగా, తర్వాత లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం రెండు రోజుల క్రితమే ప్రారంభమైంది. ఐతే ఈ ప్రచారంతో నిమిత్తం లేకుండా నైట్ కర్ఫ్యూ ఆంక్షలతోనే బెంబేలెత్తిన జనం దాదర్ వెజిటబుల్ మార్కెట్ దగ్గర పోటెత్తారు

ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రే గత మూడు నెలల క్రితం నుంచి ఇక్కడి ప్రజలకు రోజూ విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కోవిడ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోతే తిరిగి కఠిన చర్యలకు దిగాల్సిందేనని చెప్తూనే ఉన్నారు. కానీ జనం వినడం వినకపోవడం అటుంచి సెలబ్రెటీలు కూడా ఈ కరోనాబారిన పడుతున్నారు. సెలబ్రెటీల ప్రస్తావన ఎందుకంటే, వారంతా కరోనాపై అవగాహన కల్పించేందుకు గతంలో ముందుకు వచ్చారు.

అలాంటిది వారే వైరస్ బారిన పడుతున్నారంటే కేవలం అజాగ్రత్తే అని చెప్పలేం. వైరస్ స్ప్రెడింగ్ స్పీడ్ అంతగా ఉందని కూడా అనుకోవాలి. గడచిన 24 గంటల్లో ఇక్కడ 36902మందికి వైరస్ సోకింది. దేశం మొత్తం మీద 62714 కేసులు నమోదు అయ్యాయ్. అందులో సగానికిపైగానే ఇక్కడ బైటపడుతున్నాయంటే మహారాష్ట్ర వైరస్‌కి ఎంత హాట్‌స్పాట్‌గా మారిందో అర్ధం చేసుకోవచ్చు. పైగా దేశం మొత్తం మీద నమోదైన ఈ కేసుల సంఖ్య ఏకంగా అక్టోబర్ నాటి స్థాయితో సమానం.

అంటే దేశంలో కరోనా కేసుల తీవ్రత మార్చి మొదటిలో పూర్తిగా తక్కువ స్థాయికి చేరగా, తిరిగి ఇప్పుడు పెరుగుతూ గత ఏడాది స్థాయికి చేరుతుందేమో అన్న ఆందోళన బయలుదేరింది. ఒక్కసారిగా రోజుకు 20వేలు..25వేలు..30వేలు..40వేలు దాటేసి ఏకంగా 60వేల సంఖ్యకి చేరడమనేది వైద్యారోగ్యశాఖపై తీవ్రమైన భారం పడే పరిస్థితిని సూచిస్తోంది

ఇక్కడే కాదు ఒడిశా రాష్ట్రంలో కొత్తగా 290 కేసులు బైటపడ్డాయ్. అలానే తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదని సిఎం కేసీఆర్ చెప్తూనే, భారీగా గుమిగూడటంపై నిషేధాజ్ఞలు జారీ చేశారు.మాస్క్ పెట్టుకోకపోతే జైలుకే పంపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసారు, కానీ అవి అమలవుతున్న పరిస్థితి మాత్రం కన్పించడం లేదు. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, జబల్‌పూర్, ఇండోర్‌లో ప్రతి ఆదివారం లాక్‌డౌన్ అమలు అవుతోంది.

బెంగళూరులో ఏకంగా పదేళ్లలోపు చిన్నారులు 470మందికి నావెల్ కరోనా వైరస్ సోకినట్లు బైటపడింది. మరోవైపు ఎయిర్ ట్రావెల్ బబుల్ ఏర్పాటు చేసుకున్న దేశాలతో కూడా ప్రయాణాలు నిషేధించాలనే డిమాండ్ పెరుగుతోంది. అది జరిగితే ఏవియేషన్ స్టాక్స్‌కి మరోసారి గడ్డు కాలమే. ఒక్క ఇవనే కాదు, గత సంవత్సరంలో విదించిన లాక్‌డౌన్‌తో ఆదాయానికి గ్యారంటీ లేని జీవితాలు ఎన్నో ఛిద్రమైపోయాయ్.

దాదాపు 12 కోట్లమంది ఉపాధి కోల్పోయినట్లు అంచనా. ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్పుకుంటున్న ఆర్థికరంగంపై లాక్‌డౌన్‌ల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. అందుకే గతి లేని పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారే తప్ప ఎక్కడా వాటినో సమస్యలకు పరిష్కార మార్గంగా చూడటం లేదు.

Tags

Next Story