బిడ్డ లెక్క సాకుతుండే.. అడవి పంది లేకుండ అన్నమెట్ల తినేది: అమ్మ ఆవేదన

బిడ్డ చనిపోయిన బాధతో ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఎక్కడి నుంచో అడవి పంది పిల్ల పరిగెట్టుకుని వచ్చి ఆమె కాళ్లకు అడ్డం పడింది.. అమ్మా అన్న పిలుపొక్కటే తక్కువ. అప్యాయంగా ఆమెకేసి చూసింది. దేవుడు రక్తం పంచుకుపుట్టిన బిడ్డను తీసుకెళ్లినా ఏ బంధం లేని ఈ పంది పిల్లను దగ్గర చేశాడనుకుంది. అక్కున చేర్చుకుంది.
ఆరోజు నుంచి అన్నీ తానై పెంచుతోంది. అడవి ముఖం చూడని పంది పిల్లను కన్నబిడ్డలా సాకుతున్న తీరు చూసి ఊళ్లో వాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. అయినా తన పంథా మార్చుకోలేదు. ఏవరేమనుకుంటే నాకేం. నాబిడ్డ నా దగ్గరే ఉంటది. నేను పెట్టింది తింటది అని దాని తల నిమురుతూ అప్యాయంగా దగ్గరకు తీసుకుంది.
ఈ వింత సంఘటన ఒడిశాలోని కియోన్‌జార్ జిల్లాలో వెలుగు చూసింది. పెంపుడు జంతువులు కుక్క, పిల్లి వంటి వాటిని పెంచుకుని వాటికి ప్రేమను పంచే విషయం తెలుసు. కానీ పంది పిల్లతో ఇంత అటాచ్‌మెంట్ ఎక్కడా చూసి ఉండరు.
తెల్కోయి బ్లాక్ పరిధిలోని పురుషోత్తంపూర్ గ్రామానికి చెందిన కుంతల కుమారి పెంతేయి అనే మహిళ గత 10 నెలలుగా అడవి పందిని పెంచుతోంది. సమీపంలోని అడవి నుంచి పందిపిల్ల ఆమె దగ్గరకు వచ్చింది. అప్పటి నుంచి కుంతల దాన్ని పెంచుతోంది. దానికి 'ధుదా' అని పేరు కూడా పెట్టింది.
అటవీ అధికారులు ఈ విషయం తెలుసి మార్చి 9 న ఆమె ఇంటికి వెళ్లారు. వారు ఆమె నుండి అడవి పందిని దూరం చేసి అడవిలో వదిలి పెట్టి వచ్చారు.
కానీ పంది దూరమవడం తట్టుకోలేని కుంతల తన పెంపుడు జంతువు దూధా కోసం తిరిగి అడవికి వెళ్లి అక్కడ అంతా గాలించింది.
సమీప ప్రాంతంలో అడవి పంది కదలిక గురించి కొంతమంది తోటి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో, కుంతల మరియు ఆమె కుమార్తె బుధవారం అడవి లోపలికి వెళ్లి ఆమె పెంపుడు జంతువును కనుగొన్నారు. ఆమె దాని పేరు పిలిచిన వెంటనే, పందిపిల్ల ఆమె వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది.
పెంపుడు జంతువుకు ఆహారం ఇచ్చిన తరువాత, ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చింది. ఈ సంఘటన గురించి అడిగినప్పుడు, వన్యప్రాణుల సంరక్షణ చట్టం యొక్క షెడ్యూల్ III ప్రకారం అడవి పందులు రక్షించబడుతున్నాయని, వాటిని పెంపుడు జంతువులుగా ఉంచడం చట్టవిరుద్ధమని వన్యప్రాణి నిపుణుడు లాలా ఎకె సింగ్ అన్నారు.
వన్యప్రాణుల రక్షణ చట్టం అడవి జంతువుల రక్షణ కోసం ఉద్దేశించినది కనుక అవి సంతోషంగా జీవించడం అవసరం అని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com