బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి.. 40 వేలకుపైగా పక్షులను చంపేందుకు చర్యలు

బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి.. 40 వేలకుపైగా పక్షులను చంపేందుకు చర్యలు
వైరస్ సోకిన ప్రాంతాలకు కిలోమీటరు పరిధిలోని బాతులు, కోళ్లు వంటి 40 వేలకుపైగా పక్షులను చంపేందుకు చర్యలు జరుగుతున్నాయి.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్ పక్షుల ప్రాణాలు తీస్తోంది. ముందుగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో వెలుగు చూసిన పక్షి వైరస్.. క్రమంగా మిగతా రాష్ట్రాలకు పాకుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వైరస్ సోకి ఇప్పటికే కాకులు, బాతులు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మృత్యువాత పడిన పక్షుల్లోంచి సేకరించిన శాంపిల్స్‌ను అధికారులు పరీక్షల కోసం భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపించారు. ఈ శాంపిల్స్‌లో బర్డ్‌ ఫ్లూ ఉన్నట్లు తేలడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది.

బర్డ్ ఫ్లూ వైరస్ ప్రాణాంతకమైంది. ఇది పక్షులకే కాదు... మనుషులకు కూడా ప్రమాదకరమేనని అధికారులు అంటున్నారు. ఈ వైరస్ సోకి కొన్ని పక్షులు మృత్యువాత పడుతుండగా.. వైరస్ సోకకున్నా పక్షులకు ప్రాణాపాయం తప్పడం లేదు. పక్షులకు వైరస్ సోకితే.. అది మనుషులకు సోకుతుందనే భయంతో సమీపంలోని బర్డ్స్‌ని చంపేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. కేరళలోని కొట్లాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ అలజడి రేపింది. దీంతో వైరస్ సోకిన ప్రాంతాలకు కిలోమీటరు పరిధిలోని బాతులు, కోళ్లు వంటి 40 వేలకుపైగా పక్షులను చంపేందుకు చర్యలు జరుగుతున్నాయి.

వలస పక్షులకు కూడా ఈ వైరస్ పట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాల్లో ఉన్న పాంగ్ డ్యామ్‌లో ఈ విషయం వెలుగు చూసింది. అక్కడి అభయారణ్యంలో దాదాపు 1800 వలస పక్షులు బర్డ్‌ ఫ్లూతో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అటు రాజస్థాన్‌లో బర్డ్‌ ఫ్లూ వైరస్ వల్ల దాదాపు 600 పక్షులు మృత్యువాత పడ్డాయి. ఇక కాకులు మరణించిన ఝలావర్‌, బరన్‌, కోటా, పాలి, జోధ్‌పుర్‌, జైపుర్‌ వంటి ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. అటు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చాలా కాకులు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తుండడంతో నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.


Tags

Read MoreRead Less
Next Story