Amma Ki Thali: చదివింది అయిదు.. 'అమ్మాకి థాలీ' పెట్టి నెలకు రూ.70 వేలు సంపాదిస్తూ..

Amma Ki Thali: చదివింది అయిదు.. అమ్మాకి థాలీ పెట్టి నెలకు రూ.70 వేలు సంపాదిస్తూ..
X
Amma Ki Thali: అభిరుచికి సంకల్పం తోడైతే విజయం వరిస్తుంది. ఆమె చదువుకుంది అయిదే.. అయితేనేం.. అద్భుతంగా వంట చేస్తుంది..

Amma Ki Thali:అభిరుచికి సంకల్పం తోడైతే విజయం వరిస్తుంది. ఆమె చదువుకుంది అయిదే.. అయితేనేం.. అద్భుతంగా వంట చేస్తుంది.. కన్నబిడ్డల్ని కష్టపడి ప్రయోజకుల్ని చేసింది. అమ్మ ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో ఆమె చేతి వంట కూడా అంతే రుచిగా ఉంటుంది అంటారు కొడుకులు. అందుకే ఆమెని సెలబ్రెటీని చేశారు ఆ ముగ్గురు కొడుకులు.

ఉద్యోగ, వ్యాపారాలు చేస్తూనే అమ్మ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నారు. అదే 'అమ్మాకి థాలి'. నేడు, శశికళ ఛానెల్‌కు 1.7 మిలియన్ల మంది సబ్ స్కైబర్ లు, 262 మిలియన్ల మంది వీక్షకులు ఉన్నారు. దీని ద్వారా ఆమె నెలకు రూ. 70,000 సంపాదిస్తోంది.

పాకిస్తాన్, ఫిజీ, USA, దుబాయ్ వంటి దేశాలతో సహా ప్రపంచం నలుమూలల ప్రజలు 'అమ్మాకి థాలి'ని ఆస్వాదిస్తున్నారు. నాఈ ఘనత అంతా నా కుమారులు చందన్, సూరజ్, పంకజ్ లకు చెందుతుంది అని ఆనందంగా చెబుతుంది శశికళ చౌరాసియా.

ఉత్తరప్రదేశ్‌లోని ఆర్ అఖ్వా గ్రామం దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటి. పేదరికం, వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించడం, అరకొర మౌలిక సదుపాయల కారణంగా గ్రామంలోని ప్రజలు పని కోసం పట్టణ బాట పట్టారు.

కానీ 2016లో ఆ చిన్న గ్రామంలో 4G ఇంటర్నెట్‌ను ప్రవేశపెట్టడం వల్ల జనాభాలో సామాజిక-ఆర్థిక అసమానతలు తగ్గాయి. తద్వారా యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 50 ఏళ్ల శశికళ అందుకు ఉదాహరణ.

శశికళ తన జీవితంలో దాదాపు 30 ఏళ్లు తన ముగ్గురు కుమారులు చందన్, సూరజ్, పంకజ్‌ల సంరక్షణలో గడిపింది. కానీ 4G ఇంటర్నెట్ రాకతో ఆమె జీవితం మారిపోయింది.

ఆమె పెద్ద కుమారుడు చందన్ మాట్లాడుతూ, "2016లో, మొబైల్ బ్రాండ్ యొక్క ఇంటర్నెట్ డాంగిల్స్ మా గ్రామంలోకి ప్రవేశించాయి. ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ లో వివిధ అవకాశాలను అన్వేషిస్తున్నారు. నా స్నేహితులు కొందరు బ్లాగర్లయ్యారు. మరికొందరు సోషల్ మీడియాలో నిమగ్నమయ్యారు.

ఒక రోజు చందన్ తన స్నేహితుల ద్వారా యూట్యూబ్ లో వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని తెలుసుకున్నాడు. "ఇదంతా వీడియోలు వీక్షించే సంఖ్యపై ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. అలాంటి అవకాశం ఉంటే, మా అమ్మ వంట బాగా చేస్తుంది కదా. ఆమె మంచి వంటకం తయారు చేసినప్పుడు దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలనుకున్నాడు.

శశికళ రుచికరమైన వంటకాలను తయారు చేయడంలో దిట్ట. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆమె వంటని ఇష్టపడతారు. 29 ఏళ్ల ఇంజనీర్ చందన్ మిగిలిన ఇద్దరు సోదరులతో తన ఆలోచనను పంచుకున్నాడు. అన్న ఆలోచనకు వారు కూడా మద్దతు పలికారు.

చందన్, సూరజ్, పంకజ్ తమ తల్లికి ఈ విషయం చెప్పారు. సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు.. నేను వంటలు చేయడం ఏంటి అని శశికళ అనుమానం వ్యక్తం చేశారు.

కేవలం వంటల వీడియోల ద్వారా డబ్బు సంపాదించడం అవాస్తవంగా అనిపించింది ఆమెకు. కానీ ముగ్గురు కొడుకులు పట్టుబట్టారు. అయితే, ప్రేక్షకులకు నా ముఖం చూపించకూడదనే షరతు పెట్టింది శశికళ. ఆ తర్వాత చందన్ యూట్యూబ్‌లో 'అమ్మా కి థాలీ' అనే పేజీని క్రియేట్ చేశాడు.

1 నవంబర్ 2017న, శశికళ కుమారులు ఆమె బూందీ ఖీర్‌ను తయారుచేస్తున్న వీడియోను తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి అప్‌లోడ్ చేశారు. కానీ కొంతమంది వీక్షకులు మాత్రమే ఆ వీడియోను చూశారు. అయినా నిరాశ చెందలేదు.

అలా ఐదు నెలలకు పైగా వీడియోలు చేస్తూనే ఉన్నారు అన్నదమ్ములు ముగ్గురు. వీక్షకుల సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తూనే ఉన్నారు ముగ్గురూ.

ఆ తర్వాత మే 2018లో, మామిడికాయ పచ్చడి రెసిపీ వీడియోను అప్‌లోడ్ చేయాలని నిర్ణయించుకున్నారు. "వేసవి కాలం కదా. అందరూ మామిడి కాయ పచ్చడి పెట్టే పనిలో ఉంటారని దానిపై దృష్టి సారించారు.

అనుకున్నట్టుగానే ఆ వీడియో కొన్ని గంటల్లోనే వేలాది వీక్షణలను సంపాదించింది. ఈ ప్రత్యేకమైన ఊరగాయ చేయడానికి మా అమ్మ బెల్లం ఉపయోగించింది. చాలామంది దీనిని మామిడికాయ పచ్చడి తయారీలో ఉపయోగించరు. బహుశా అదే ఈ వీడియో వీక్షించడానికి కారణమై ఉంటుంది అని చందన్ చెప్పారు.

ఇప్పటి వరకు అమ్మాకి థాలీలో అత్యధికంగా వీక్షించిన వీడియో సూజీ కే గులాబ్ జామూన్, ఇది 50 మిలియన్ల వీక్షణలను సంపాదించిన డెజర్ట్. రెండవది రసగుల్లా వీడియో 41 మిలియన్ల వీక్షణలను పొందింది, "అని చందన్ చెప్పారు.

"మా అమ్మ ఇంట్లో దొరికే పదార్థాలన్నీ వాడుతుంది. ఆమె మా వీక్షకులకు అర్థమయ్యే సరళమైన, స్పష్టమైన భాషలో మాట్లాడుతుంది. అదే మాకు వీక్షకులను తెచ్చిపెడుతుంది అంటారు అన్నదమ్ములు.

చందన్ షూట్ చేస్తే పంకజ్ వీడియోలను క్యాప్చర్ చేస్తాడు. సూరజ్ వాటిని ఎడిట్ చేస్తాడు. ఛానెల్ ద్వారా వచ్చే సంపాదన తల్లి బ్యాంకు ఖాతాలోకి వెళ్తుంది.

"మాకు మా ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్నాయి. ఖాళీ సమయంలో అమ్మకు సహాయం చేస్తాము అంటారు. ఇంతకుముందు కెమెరా అంటే సిగ్గుపడే అమ్మ ఇప్పుడు తరచూ వీడియోలు షూట్ చేయాలని పట్టుపడుతోంది. ఆమె కూడా తన పనికి తగిన గుర్తింపు లభించిందని సంతోష పడుతోంది.

శశికళ మాట్లాడుతూ, ఇంతకుముందు నేను వంట చేయగలనని మా కుటుంబానికి మాత్రమే తెలుసు, కానీ నేడు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలు నన్ను గుర్తిస్తున్నారు. తనతో సెల్ఫీలు తీసుకుంటామని అడుగుతున్నారు. నా వంట నన్నొక సెలబ్రెటీని చేసింది.

ఈ వయస్సులో నాకు సమాజంలో గౌరవం, గుర్తింపు కలిగినందుకు గర్వంగా భావిస్తున్నాను. తన వీడియోలను చూసి అందరూ వంట నేర్చుకోవాలని శశికళ భావిస్తున్నారు. వంట చేయడం కష్టం అనే భావనను నేను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సులభంగా వంట చేసుకునే వీడియోలను తాను తయారు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది.

Tags

Next Story