Goa Elections : గోవా అసెంబ్లీ ఎన్నికలు.. శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ

Goa Elections : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేశారు ఇరు పార్టీల నేతలు. మహారాష్ట్రలో అధికార మహావికాస్అఘాడీలో భాగమైన ఇరుపార్టీలు.. కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకు వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎన్‌సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, జితేంద్ర అవాద్హ్, శివసేన ఎంసీ సంజయ్ రౌత్... కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో జట్టుకట్టకపోవడం కాంగ్రెస్ దరదృష్టకరమన్నారు. ఈ ఎన్నికల్లో తమ బలం చూపిస్తామని... అధికారంలోకి వచ్చే తామేనన్నారు. గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పెద్ద కుమారుడు ఉత్పల్ పారికర్... స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తే మద్దతిస్తామన్నారు.
ఈ ఎన్నికల్లో పొత్తు విషయమై శివసేన- కాంగ్రెస్ మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. అయితే బీజేపీ బలంగా ఉండే స్థానాలను శివసేనకు కాంగ్రెస్ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో శివసేన.. కాంగ్రెస్‌తో పొత్తుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ తరహాలో గోవా సర్కారును ఏర్పాటు చేయాలంటే.. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని శివసేన అడగ్గా.. అందుకు కాంగ్రెస్ నిరాకరించిందనే వాదన వినిపిస్తోంది. అందుకే శివసేన నేతలు కాంగ్రెస్ పట్ల బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
గోవాలో శివసేన 10 నుంచి 15 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇరు పార్టీల నేతలు చర్చించి సీట్ల కేటాయింపునకు తుది రూపును ఇవ్వనున్నారని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. ఎన్నికలు ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com