Sikkim : హిమపాతంతో ఏడుగురు పర్యాటకులు మృతి

సిక్కింలోని భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న పర్యాటక ప్రదేశం నాథూలా పాస్ వద్ద ఘోరం చోటుచేసుకుంది. హిమపాతంతో ఏడుగురు పర్యాటకులు మృతిచెందారు. వారిలో ఓ మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. నాథూలా పాస్ 15వ నంబర్ మైలురాయి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో 30 మంది టూరిస్టులు అక్కడ ఉన్నారని, హిమపాతం కారణంగా వారంతా మంచు కింద చిక్కుకుపోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సైన్యంతోపాటు.. సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం, స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఏడుగురు పర్యాటకులు మృతిచెందగా.. 23 మందిని సురక్షితంగా వెలికితీసి, గాంతోక్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు అధికారులు వివరించారు. ప్రతికూల వాతావరణం కారణంగా.. 13 నుంచి 17 నంబర్ల మైలురాళ్ల వైపు వెళ్లకూడదని ఉదయమే హెచ్చరికలు జారీ చేశామని, కొందరు పర్యాటకులు వాహనాల డ్రైవర్లను బలవంతపెట్టి, ఆ ప్రాంతానికి వెళ్లడంతో ఈ దారుణం చోటుచేసుకుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com