Karnataka : కుదిపేస్తోన్న హిజాబ్ వివాదం.. కర్ణాటక వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు

Karnataka : కర్నాటకను హిజాబ్ వివాదం కుదిపేస్తోంది. వస్త్రధారణపై రెండు వర్గాల విద్యార్థుల మధ్య మొదలైన వివాదం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉడిపి, మాంఢ్య, శివమొగ్గలో హింషాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల ప్రైవేట్ బస్సులు, వాహనాలపై దాడులు జరిగాయి. దీంతో శివమొగ్గలో 144 సెక్షన్ విధించి.. భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పుతుండటంతో.. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను దింపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులపాటు సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. అంతా సంయమనం పాటించాలని కోరింది. మరోపక్క హిజాబ్ వివాదంపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. విద్యా సంస్థల్లో డ్రెస్ కోడ్ ఉండాల్సిందేనని కర్నాటక ప్రభుత్వం వాదనలు వినిపించింది. అయితే మధ్యంతరం ఉత్తర్వులు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేసిన కోర్టు.. విస్త్రత ధర్మాసనానికి పిటిషన్ బదిలీ చేసింది. దీనిపై రెండు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. వివాదానికి త్వరితగతిన పరిష్‌కారం చూపాలని కోరాయి.
మతం ఆధారంగా విద్యాసంస్థల్లో వస్త్రధారణ ఉండకూడదన్న ఆదేశాలతో వివాదం రాజుకుంది. ఉడిపిలో ఓ పాఠశాలలో.. హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను ప్రిన్సిపల్ అడ్డుకోవడంతో గొడవ పెద్దైంది. దీంతోపాటు శివమొగ్గ, మాంఢ్య ప్రాంతాల్లో పలు పాఠశాలలు.. హిజాబ్ ధరించిన విద్యార్థునులను పాఠశాలలోకి అనుమతించలేదు. వారిని అనుమతించిన పాఠశాలల్లో.. మరో వర్గం విద్యార్థులు కాషాయ వస్త్రాలు ధరించి రావడం.. ఘర్షణలకు దారితీసింది. ఉడుపి, బెళగావి, కలబురగి సహా పలు ప్రాంతాల్లో హిజాబ్, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలల్లో ర్యాలీలు చేయండం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కొన్ని చోట్ల ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇది రాష్ట్రమంతా పాకి.. మత ఘర్షణలకు దారితీసేలా వ్యాప్తించింది.
హిజాబ్‌పై రెండు వర్గాలు తమతమ వాదనలు వినిపిస్తున్నాయి. ఇది తమకు ఇప్పుడు వచ్చింది కాదని.. పుట్టినప్పటి నుంచీ హిజాబ్ ధరిస్తున్నామని.. మైనార్టీ వర్గాల విద్యార్థినులు అంటున్నారు. అంతా సమానం అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో వస్త్రధారణ ఏంటని మరో వర్గం విద్యార్థులు అంటున్నారు. అందరికీ ఒకే డ్రస్ కోడ్ ఉండాలని వాదిస్తున్నారు. అయితే తనను అడ్డుకున్న విద్యార్థి వర్గాన్ని ఒంటరిగా ఎదురించిన విద్యార్థినిపై ప్రశంసలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలువురు.. యువతికి మద్దతు తెలిపారు. దీనిపై స్పందించిన ఆమె.. జై శ్రీరామ్ అంటూ విద్యార్థులు తన మీదకి దూసుకురాబట్టే.. తాను అల్లాహ్ అక్బర్ అనాల్సి వచ్చిందని తెలిపింది. దేశంలో అందరూ సమానమే అన్న యువతి.. ఎవరి కట్టుబాట్లు వారికి ఉన్నాయని.. ఎవరికి వారివి ముఖ్యమే అన్నారు. జై శ్రీరామ్ అన్నా.. అల్లాహు అక్బర్ అన్నా.. రెండిటిలోనూ తప్పులేదన్నారు.
ఈ వివాదంపై ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ స్పందించారు. వస్త్రధారణ వివాదం విద్యార్థుల మధ్య మత విద్వేషంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు తమిళనాడుకు పాకకూడదన్న కమల్.. ప్రభుత్వం సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని ట్విటర్ ద్వారా కోరారు. హిజాబ్ వివాదంపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ట్విటర్ వేదికగా స్పందించారు. హిజాబ్‌లో వస్తోన్న బాలికలను చదువుకోనివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. చదువా.. హిజాబా.. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునేలా కాలేజీలు బలవంతపెడుతున్నాయని.. హిజాబ్ ధరించిన అమ్మాయిలను చదువుకు తిరస్కరించడం దారుణని.. భారత నేతలు దీన్ని ఆపాలి మలాలా కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com