Ashish Mishra: 'రైతులపై కావాలనే కారు ఎక్కించారు'.. లఖింపూర్ ఘటనపై సిట్..

Ashish Mishra (tv5news.in)
Ashish Mishra: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ లఖింపూర్‌ఖేరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్.. కీలక విషయాలను వెల్లడించింది. ఈ హింసాకాండ ప్రణాళికాబద్దమైన కుట్రేనని పేర్కొంది. రైతులపై కావాలనే కారు ఎక్కించారని కుండ బద్దలు కొట్టింది. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిశ్ మిశ్రాపై ఇప్పటికే నమోదైన అభియోగాలను మార్చాలంటూ.. ఈ కేసు విచారణ జరుపుతున్న న్యాయమూర్తికి సిట్ లేఖ రాసింది.
నిందితులపై ఉన్న ఐపీసీలోని 279, 338, 304ఏ.. స్థానంలో ఐపీసీ సెక్షన్ 307 సహా.. కొత్త సెక్షన్లను చేర్చేందుకు అనుమతించాలని సిట్ కోరింది. ఇప్పటికే కేంద్ర మంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రా ప్రధాన నిందుతుడిగా ఉన్నారు. అతనితో సహా 13 మందిపై హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లుగా అభియోగాలున్నాయి. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సిట్ తాజా దరఖాస్తుతో ఆశిశ్ మిశ్రాకు ఉచ్చు బిగుస్తున్నట్లయ్యింది.
సాగుచట్టాలకు వ్యతిరేకంగా అక్టోబర్ మూడున లఖింపూర్ ఖేరీలో రైతులు నిరసన చేపట్టారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను అడ్డుకునేందుకు రోడ్డెక్కిన వందలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. అయితే ఇదే సమయంలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు చెందిన కాన్వాయ్ రైతులపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
యావత్ దేశాన్ని ఈ ఘటన ఓ కుదుపుకుదిపింది. విపక్షాలు, కిసాన్ సంఘాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ఈ కేసు నుంచి కేంద్ర మంత్రి కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. దర్యాప్తు విధానంపై సుప్రీంకోర్టు సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు అప్పుడు కాల్పులు జరిపింది ఆశీష్ మిశ్రానే అని ఫోరెన్సిక్ రిపోర్ట్ స్పష్టం చేయడంతో కేంద్రమంత్రి మరింత ఇరకాటంలో పడ్డారు. కుమారుడిని నిందితుల జాబితా నుంచి తప్పించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఫోరెన్సిక్ రిపోర్ట్ అడ్డుకట్ట వేసింది. తాజాగా సిట్ వెల్లడించిన విషయాలు ప్రధాన నిందుతుడి చుట్టు ఉచ్చును బిగిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com