బాబాగుడికి నా ఇష్టమొచ్చిన డ్రెస్సులో వెళ్తా.. మీకేంటి నొప్పి! : తృప్తి దేశాయ్

బాబాగుడికి నా ఇష్టమొచ్చిన డ్రెస్సులో వెళ్తా.. మీకేంటి నొప్పి! : తృప్తి దేశాయ్
X

తృప్తి దేశాయ్ హడావుడి మళ్లీ మొదలైంది. శనిసింగాపూర్, శబరిమలలో చేసిన రచ్చే షిరిడీలోనూ చేయాలని డిసైడ్ అయింది. గుడికి సంప్రదాయ దుస్తుల్లో రావాలనేది ఓ నిబంధన. కాని, తృప్తి దేశాయ్‌కి మాత్రం అది నచ్చడం లేదు. తనకు నచ్చిన డ్రెస్సులో వస్తా.. ఏం చేస్తారో చేసుకోండని సవాల్ విసురుతోంది. పైగా వార్నింగ్ కూడా ఇచ్చింది. షిరిడీ వచ్చి.. సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని రాసి పెట్టి ఉన్న పోస్టర్లను, నోటీసు బోర్డును చించేస్తుందట.

నచ్చితే వెళ్లాలి, లేదంటే మానేయాలి. ఈ సింపుల్ సూత్రాన్ని పక్కనపెట్టి.. రచ్చ చేయడానికే వెళ్తానంటోంది తృప్తి దేశాయ్. ఎంత సినీ హీరోయిన్ అయినా.. గుడికి అనగానే ఓ పద్దతి ప్రకారం దుస్తులు ధరించి వస్తారు. సెలబ్రిటీలు, ఆడంబరాలకు పోయే వాళ్లు సైతం ఇదే పద్దతి ఫాలో అవుతారు. కాని, తృప్తి దేశాయ్‌కి ఇలాంటివి నచ్చడం లేదు. ఇష్టమొచ్చిన డ్రెస్సులో వస్తే తప్పేంటని నిలదీస్తోంది. పైగా చించేస్తానంటూ వార్నింగులు కూడా ఇస్తోంది. తృప్తి దేశాయ్ గురించి తెలుసుకున్న షిరిడీ ఆలయ సిబ్బంది.. గుడిలో ఆమె ప్రవేశాన్ని నిషేధిస్తూ నోటీసులు జారీ చేసింది. కాదూ.. వస్తాను అంటే మాత్రం సెక్షన్ 188 ఐపీసీ ప్రకారం చర్యలు తీసుకుంటామని షిరిడీ సబ్ డివిజనల్ ఆఫీస్ తేల్చి చెప్పింది. షిరిడీనే కాదు అసలు అహ్మద్‌నగర్ జిల్లాలో కూడా ఆమె ప్రవేశంపై నిషేధం విధించారు.

షిరిడీ ఆలయంలోకి వచ్చే భక్తులు సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాలని ఆలయ కమిటీ పోస్టర్లను అంటించింది. ఈ నిబంధన తన హక్కులను కాలరాసే విధంగా ఉందంటూ తప్పుబడుతోంది తృప్తి దేశాయ్. మర్యాదగా నోటీసులు, పోస్టర్లు తీసేస్తే సరి.. లేదంటే తానే స్వయంగా వచ్చి పోస్టర్లను చించేస్తానని చెప్పింది. తృప్తి దేశాయ్ వస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తవచ్చనే ఆలోచనతో, ముందు జాగ్రత్తగా నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం తహతహలాడే తృప్తీ దేశాయ్‌కి సరైన శాస్తి జరిగిందని కొన్ని హిందూ సంఘాలు, సంస్థలు అంటున్నాయి.

నిజానికి షిరిడీలో అంటించిన పోస్టర్లలో నిబంధనలేవీ లేవు. ఈమధ్య కొంత మంది భక్తుల వస్త్రాధారణపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో షిరిడీ వచ్చేవారికి అభ్యర్థన చేసే విధంగా ఆలయ పరిసరాల్లో పోస్టర్లు అంటించారు. భారతీయ సంప్రదాయ దుస్తులు వేసుకుని రావాలనేది దాని సారాంశం. ఇది విజ్ఞప్తే తప్పితే నిబంధన కాదు అని కూడా షిరిడీ ట్రస్ట్ వివరణ ఇచ్చింది. అయినా సరే.. తృప్తి దేశాయ్‌కి నచ్చడం లేదట. ఈ పోస్టర్లు వేసినందుకు షిరిడీ ట్రస్ట్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాసింది తృప్తి దేశాయ్.

ఇంతకీ.. ఇష్టం వచ్చిన డ్రస్సులు వేసుకొస్తానంటే ఏంటి అర్థం. చాలీచాలని దుస్తులు వేసుకుని వస్తుందనా? లేదంటే అసభ్యకరంగా ఉన్నా ఫర్వాలేదు మీకు నచ్చిన డ్రస్సు వేసుకుని రమ్మనా? తృప్తి దేశాయ్ చేస్తున్న రచ్చ.. ఎవరికీ నచ్చడం లేదు. పైగా హిందూ ఆలయాలనే టార్గెట్‌గా చేసుకుని ఈమె ప్రవర్తిస్తున్న తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

Tags

Next Story