Vadodara: సోలో మ్యారేజ్.. తనను తాను వివాహం చేసుకోనున్న మొదటి మహిళ..

సోలో బ్రతుకే సో బెటరు.. పాట వినే వుంటాం.. ఇప్పుడు సోలో మ్యారేజ్ కూడా సో బెటర్ అంటోంది గుజరాత్ కు చెందిన క్షమా బిందు. ఇతర పెళ్లికూతురులాగానే, 24 ఏళ్ల క్షమా బిందు జూన్ 11వ తేదీన తన వెడ్డింగ్ డే కోసం సిద్ధమవుతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన పెళ్లి తనతోనే చేసుకుంటోంది.
ఇది నమ్మశక్యంగా అనిపించక పోవచ్చు. కానీ పెళ్లి పెద్ద, పెళ్లి కొడుకు, బరాత్ తప్ప పెళ్లిలో ఉన్న అన్ని సంప్రదాయాలు ఉంటాయి. గుజరాత్‌లో ఇది బహుశా మొదటి స్వీయ వివాహం లేదా సోలో వివాహం కావచ్చు..
"నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నేను పెళ్లికూతురు కావాలని అనుకున్నాను. కాబట్టి నన్ను నేనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని క్షమా మీడియాకి చెప్పారు.
దేశంలో ఎవరైనా మహిళ తనను తాను వివాహం చేసుకుందా లేదా అని తెలుసుకోవడానికి ఆమె ఆన్‌లైన్‌లో కొంత పరిశోధన చేసింది. కానీ తనలా ఆలోచించన వారు ఎవరూ లేరని తానే మొదటి వ్యక్తి అని చెప్పింది.
"స్వీయ-వివాహం అనేది షరతులు లేని ప్రేమ. ప్రజలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటారు. నేను నన్ను ప్రేమిస్తున్నాను, అందుకే ఈ పెళ్లి జరుగుతోంది" అని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసే క్షమా వివరించింది.
కొందరు స్వీయ వివాహాన్ని అసంబద్ధ చర్యగా భావించవచ్చని ఆమె అన్నారు. "కానీ ఎవరికి నచ్చినట్లు వారు ఉండడంతో తప్పులేద.. అని ఆమె చెప్పింది. ఆమె తల్లిదండ్రులు ఓపెన్ మైండెడ్ అని తన పెళ్లికి వారు ఆశీర్వాదాలు అందించారని తెలిపింది. గోత్రిలోని ఒక దేవాలయంలో తన వివాహాన్ని ఘనంగా జరిపేందుకు క్షమా ఏర్పాట్లు చేసుకుంది.
అంతే కాదు. గోవాలో రెండు వారాల హనీమూన్ కూడా ఆమె పోస్ట్ వెడ్డింగ్ ప్లాన్‌ల జాబితాలో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com