Congress : కాశ్మీర్‌ టూ కన్యాకుమారి.. అక్టోబర్‌ 2 నుంచి కాంగ్రెస్‌ 'భారత్‌ జోడో యాత్ర'

Congress : కాశ్మీర్‌ టూ కన్యాకుమారి.. అక్టోబర్‌ 2 నుంచి కాంగ్రెస్‌  భారత్‌ జోడో యాత్ర
Congress : కాంగ్రెస్‌లో నయా జోష్ లక్ష్యంగా ఉదయ్‌పుర్‌లో నిర్వహించిన చింతన్‌ శిబిర్‌... పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపింది.

కాంగ్రెస్‌లో నయా జోష్ లక్ష్యంగా ఉదయ్‌పుర్‌లో నిర్వహించిన చింతన్‌ శిబిర్‌... పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపింది. మూడు రోజులపాటు జరిగిన మేథోమథనం సదస్సు ముగింపు సమావేశంలో అధినేత్రి సోనియా గాంధీ కీలకోపన్యాసం చేశారు. కాంగ్రెస్‌కు కొత్త ఉషోదయం రానుందని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు సోనియా తెలిపారు. 'భారత్ జోడో' పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే యాత్ర.. గాంధీ జయంతి రోజున ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. అటు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగమే ప్రధాన అస్త్రంగా...జూన్‌ 15 నుంచి కాంగ్రెస్‌ రెండో విడత జన జాగారణ్‌ యాత్ర మొదలవుతుందని అధినేత్రి స్పష్టం చేశారు. జీవనోపాధిని నాశనం చేస్తున్న భరించలేని ధరల పెరుగుదలను జన జాగారణ్‌ యాత్రలో ఎత్తిచూపనున్నట్లు పేర్కొన్నారు.

అటు చింతన్‌ శిబిర్‌లో కీలకోపన్యాసం చేసిన రాహుల్‌... స్వాతంత్ర్యం పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమై ఉందన్న రాహుల్ ...ప్రస్తుతం పార్టీకి ప్రజలతో ఉన్న సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడమే ధ్యేయంగా కార్యకర్తలందరు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేయాలంటే ఎలాంటి షార్ట్​కట్​లు లేవన్న రాహుల్‌...నేతలంతా కష్టపడి పనిచేస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఈ పోరాటంలో తుదిశ్వాస వరకు వెంట ఉంటానని భరోసా ఇచ్చారు రాహుల్‌. దేశంలోని వ్యవస్థలన్నింటినీ మోదీ సర్కార్‌ ధ్వంసం చేస్తోందని రాహుల్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో ఎవరినీ మాట్లాడనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. దీని పర్యవసనాలకు బీజేపీ సర్కారే బాధ్యత వహించాలన్నారు రాహుల్.

అటు మూడురోజుల మేథోమథనం సదస్సులో కీలత తీర్మానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్‌' విధానాన్ని ఆమోదించింది. మరొకరు అదే కుటుంబం నుంచి వచ్చేట్లు అయితే.. కనీసం మూడేళ్ల పాటు పార్టీలో పని చేయాలని నిబంధన విధించింది. సుమారు 20 కొత్త ప్రతిపాదనలకు వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. పార్టీలో యువతకు 50 శాతం భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. బ్లాక్ స్థాయి నుంచి CWC స్థాయి వరకు 50 శాతం యువత ఉండేలా చర్యలు తీసుకోవాలని సంకల్పించింది. 50 శాతం యువత కోటాలో SC, ST, OBC, మైనారిటీలకు చోటు ఉంటుందని స్పష్టం చేసింది. అటు కాంగ్రెస్ అధ్యక్షుడికి సహాయపడేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది.

ఉదయ్‌పుర్‌ కాంగ్రెస్ నవసంకల్ప చింతన శిబిరంలో రెండో రోజు పలు కీలక అంశాలపై చర్చించిన పార్టీ నేతలు... కాంగ్రెస్​ అధ్యక్ష బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించాలనే అంశం తెరపైకి వచ్చింది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్​ సిద్ధంగా లేకపోతే.. అధ్యక్షురాలిగా ప్రియాంకను నియమించాలని యూపీ నేతలు డిమాండ్​ చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చల సందర్భంగా.. ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు యూపీ నేతలు. అయితే.. అజెండాలో లేని అంశాలు మాట్లాడవద్దని సూచించారు కమిటీ ఛైర్మన్ మల్లికార్జున్​ఖర్గే.

అటు చింతన్ శిబిర్‌లో వివిధ కమిటీలపై చర్చించి, సూచించిన సంస్కరణల ప్రక్రియను మొదలుపెట్టేందుకు టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించే సంస్కరణలు, నిర్మాణం, పార్టీ పదవులకు నియామకాలు, నియమాలు, కమ్యూనికేషన్‌లతోపాటు ప్రచారం, ఔట్‌రీచ్, ఆర్థిక, ఎన్నికల నిర్వహణ సహా అన్ని అంశాలను టాస్క్‌ఫోర్స్‌ పరిశీలిస్తుందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో టాస్క్​ఫోర్స్​పై ప్రకటన ఉంటుందని స్పష్టత ఇచ్చారు.

Tags

Next Story