'సోనూ' సాయంతో కొట్టుకోనున్న నాలుగు నెలల చిన్నారి 'గుండె'

సోనూ సాయంతో కొట్టుకోనున్న నాలుగు నెలల చిన్నారి గుండె
నీ రుణం మళ్లీ జన్మలో అయినా తీర్చుకుంటా అంటూ ఆవేదన చెందిన ఆ తల్లి కన్నీళ్లు తుడిచాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్..

అయ్యా.. ఆదుకునే వారు లేరు.. అందరూ దేవుడు ఎక్కడున్నాడంటే నిన్నే చూపిస్తున్నారు.. నా బిడ్డ ప్రాణాలు కూడా కాపాడు నాయనా.. నీ రుణం మళ్లీ జన్మలో అయినా తీర్చుకుంటా అంటూ ఆవేదన చెందిన ఆ తల్లి కన్నీళ్లు తుడిచాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్.. నీ బిడ్డకు నేను ఆపరేషన్ చేయిస్తా నంటూ ఆమెకు కొండంత భరోసా ఇచ్చాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లె గ్రామానికి చెందిన పెందిపెల్లి బాబు, రజిత దంపతుల నాలుగు నెలల కుమారుడు అద్విత్ శౌర్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా వైద్యులు ఆ చిన్నారికి వెంటనే ఆపరేషన్ చేయాలని అందుకుగాను రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు.

కూలిపని చేస్తే తప్ప రోజు గడవని ఆ నిరుపేద దంపతులు వైద్యులు చెప్పింది విని బావురుమన్నారు. బిడ్డను కాపాడుకునేందుకు కనిపించిన వారందరి కాళ్లావేళ్లా పడ్డారు. బిడ్డను బ్రతికించుకోవాలన్న తల్లిదండ్రుల ఆవేదనను గుర్తించిన గ్రామస్థులు కొందరు విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ సోనూసూద్ కంటపడింది. వెంటనే స్పందించి సర్జరీకి అయ్యే ఖర్చు తాను భరిస్తానని తెలిపారు. సోనూ సూద్ సిబ్బంది బుధవారం చిన్నారి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్ లోని ఇన్నోవా హాస్పిటల్ లో గురువారం ఆపరేషన్ కు ఏర్పాటు చేయిస్తామని అందుకు సిద్ధంగా ఉండాలని అమ్మానాన్నకు కబురంపారు.

గ్రామస్తులు కూడా తలో చేయి వేసి రూ.40 వేలు సేకరించి చిన్నారి కుటుంబానికి అందించారు. ఆపరేషన్ ను డాక్టర్ కోన సాంబమూర్తి చేస్తారని సోనూసూద్ తెలిపినట్లు చిన్నారి తండ్రి వెల్లడించారు. నా బిడ్డను బతికించిన ఆ దేవుడు (సోనూ సూద్) పది కాలల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు.

Tags

Next Story