ఆయన గొంతు మూగబోయింది.. ఆయన నవ్వు చెదిరిపోయింది

అయన గొంతు తేనె కంటే తియ్యగా ఉంటుంది.. అందుకేనేమో ఎస్పీ పాట వింటే వెంట్రుకలు కూడా నిక్కబొడుచుకుంటాయి.. ఆయన పాట అంతగా పరవశింపజేస్తుంది. ఆయన సంగీతం నేర్చుకోలేదు.. కానీ సరిగమలన్ననీ ఆయన స్వరంలో హొయలు పోయేవి.. రచయితలు బాలు పాడే పాటల్లో విరుపులూ, విరహాలు రాయకపోయినా ఆ హీరోకి అభిమానుల్లో ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తన గొంతును అందుకు అనుగుణంగా మలిచేవారు. అందంగా పాడే వారు.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం ఆయన పేరులోనే కాదు ఆయన వ్యక్తిత్వం, ఆయన మాట నేటి తరం గాయనీ గాయకులకు ఆదర్శం.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన పాడిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా బాలు బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువులోనే కాదు ఆటల్లోనూ ప్రథముడైన బాలుకి తండ్రే తొలి గురువు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకి చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల ఆసక్తి పెరిగింది. స్కూల్లో మాష్టారు ఒకసారి బాలు గొంతు బావుందని చెంచులక్ష్మి సినిమాలో సుశీల ఆలపించిన పాలకడటి శేషతల్సమున అనే పాటను పాడించి రికార్డు చేశారు. తర్వాత విజయవాడ ఆకాశవాణిలో తాను స్వయంగా రాసి బాణీ కట్టి ఆలపించిన ఒక లలిత గీతానికి బహుమతి లభించింది. ఇంజనీరింగ్ కోర్సు రెండో సంవత్సరం చదువుతుండగా మహ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాలో రమాప్రభ పుట్టిన రోజు వేడుకలో హ్యాపీ బర్త్ డే టు యూ అంటూ పాట పాడుతూ తొలిసారి బాలు వెండితెర మీద దర్శనమిచ్చారు. 1964లో లలిత సంగీత పోటీల్లో బాలు పాడిన పాటకి మొదటి బహుమతి వచ్చింది. ప్రేక్షకుల మధ్య కూర్చున్న సంగీత దర్శకుడు కోదండపాణి విని ఆయనకు సినిమాల్లో పాట పాడే అవకాశం ఇచ్చారు. అన్న మాట ప్రకారం బాలుకి కోదండపాణి శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో తొలిసారి పాట పాడే అవకాశం ఇచ్చారు. ఏమి ఈ వింత మోహం పాటను బాలు పాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com