Spy Cameras: సీక్రెట్ కెమెరాల గుట్టు మన చేతిలో..

Spy Cameras: సీక్రెట్ కెమెరాల గుట్టు మన చేతిలో..

Spy Cameras: టెక్నాలజీ పెరగడం వల్ల మనుషులకు ఎంత లాభం జరిగిందో అంతకంటే ఎక్కువ నష్టం కూడా జరుగుతోంది. రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ వల్ల అసలు ప్రైవసీ అనేదే పూర్తిగా కరువైపోయింది. మన సమాచారం మనకే తెలియకుండా ఎవరెవరి చేతికో వెళుతోంది. అలా జరుగుతుందని కూడా చాలామందికి తెలియదు. పెరుగుతున్న టెక్నాలజీలో భాగంగా అందరిని ఎక్కువగా భయపెడుతున్న మరో అంశం స్పై కెమెరాలు. ఒకప్పుడు చాలాచోట్ల ఇలాంటి స్పై కెమెరాలను సీక్రెట్‌గా పెట్టి అశ్లీల చిత్రాలను షూట్ చేసి వాటితో సొమ్ము చేసుకునే వారు కేటుగాళ్లు.


ఈమధ్య అలాంటి ఘటనలు చాలావరకు తగ్గిపోయినా.. ఇంకా అక్కడక్కడా ఈ స్పై కెమెరాల ఊసు మనకు వినిపిస్తూనే ఉంది. అందుకే అలాంటి ఘటనలు మనవరకు రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.. ఒకప్పుడు స్పై కెమెరాలు పెట్టడానికి కొన్ని ప్రదేశాలు మాత్రమే అనుగుణంగా ఉండేవి. కానీ ఇప్పుడు స్విచ్‌బోర్డులు, పూల మొక్కలు, వాల్ పెయింటింగ్స్ లాంటి ఎన్నోవాటిలో ఈ స్పై కెమెరాలను అమర్చే అవకాశం ఉంది. అందుకే ఏదైనా చోటికి వెళ్లినప్పుడు ప్రతీ వస్తువును క్షుణ్ణంగా పరిశీలించాలి.


ఏదైనా నల్ల చుక్క లాంటిది కనిపిస్తుందేమో చూసి అదేంటో కనుక్కోవాలి. లేదా అక్కడి విద్యుత్ సరఫరాను ఆపేసినా స్పై కెమెరా పనిచేయడం ఆగిపోతుంది. స్పై కెమెరాలకు ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల ఫోన్ కాల్స్‌లో డిస్టర్బెన్స్ వస్తుంది. అలా మీరు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు సిగ్నల్ సరిగ్గా అందకపోతే అది ఒక రకంగా చెడు సంకేతమే. వైర్‌లెస్ కెమెరా డిటెక్టర్, హిడెన్ కెమెరా డిటెక్టర్ లాంటి యాప్స్ కూడా స్పై కెమెరాలను కనిపెట్టడానికి సహాయపడతాయి.

ఒక్కోసారి మన కళ్ల ముందు కనిపించే అద్దం కూడా మనల్ని మోసం చేస్తుంది. టూవే మిర్రర్‌లాగా కనిపించే అద్దం కూడా మనకు ప్రమాదకరమే. చేతి వేలిని అద్దానికి ఆనించినప్పుడు కాస్త గ్యాప్ కనిపిస్తే అది నిజమైన అద్దం అలా కనిపించకపోతే అది టూ వే మిర్రర్. ఇవి మాత్రమే కాకుండా గది మొత్తం చీకటిగా ఉంటే నైట్ విజన్ స్పై కెమెరాలను వాటి నుండి వచ్చే వెలుగు ద్వారా ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఫోన్‌లోని కెమెరాను లేదా ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేసి గది మొత్తం క్షుణ్ణంగా పరిశీలించినా స్పై కెమెరాలు మన చేతికి చిక్కుతాయి.

Tags

Read MoreRead Less
Next Story