Srinagar: అంత్యక్రియలకోసం తాత దాచుకున్న రూ.లక్ష లూటీ.. పోలీస్ ఆఫీసర్‌‌ త్యాగంతో..

Srinagar: అంత్యక్రియలకోసం తాత దాచుకున్న రూ.లక్ష లూటీ.. పోలీస్ ఆఫీసర్‌‌ త్యాగంతో..
X
Srinagar: రోడ్డు పక్కన చెట్టుకింద కూర్చుని పల్లీలు అమ్ముకునే తాతంటే స్కూలు పిల్లలతో పాటు దారిన పోయే వాళ్లకి కూడా ఎంతో అభిమానం.

Srinagar: అయిన వాళ్లున్నా అభాగ్యులుగా జీవిస్తున్న వారెందరో.. ఎవరూ లేని వాళ్లకి మరింత కష్టం. అయినా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఎవరి మీదా ఆధారపడకూడదనుకున్నాడు. తనకు చేతనైన పని ఏదో ఒకటి చేయాలనుకున్నాడు జమ్ము కశ్మీర్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ అనే వృద్ధుడు. పల్లీలు, బఠాణీలు అమ్మి పైసా పైసా కూడ బెట్టాడు.. పళ్లు కూడా ఊడిపోయిన ఆ తాత సంపాదించిన ప్రతి పైసాని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు.

లక్ష రూపాయల వరకు పోగేశాడు.. ఏం చేస్తావు తాతా ఆ డబ్బులన్నీ అని అడిగిన వారికి.. నేను పోయిన తరువాత మీలాంటి ధర్మాత్ములు ఎవరైనా నా అంత్యక్రియలు చేస్తారనే ఆశ అని సమాధానం చెప్పేవాడు. రోడ్డు పక్కన చెట్టుకింద కూర్చుని పల్లీలు అమ్ముకునే తాతంటే స్కూలు పిల్లలతో పాటు దారిన పోయే వాళ్లకి కూడా ఎంతో అభిమానం. తాత దగ్గర లక్ష రూపాయలు ఉన్న విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా తెలిసింది. ఆ సొమ్ము కాస్తా దొంగలపాలైంది.

దాంతో తాత బావురుమన్నాడు. పోయిన సొమ్ము తిరిగి రాదని తెలిసినా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ విషయం డిపార్ట్‌మెంట్‌లోని ఓ ఉన్నతాధికారి సందీప్ చౌదరికి తెలిసింది. వృద్ధుడి వేదన అతడిని కదిలించింది. తాత పోగొట్టుకున్న లక్ష రూపాయలు దొరుకుతాయో లేదో అని ఆలోచించాడు. తానే స్వయంగా లక్ష రూపాయలు తాతకు అందించాడు. తాత చెమర్చిన కళ్లతో ఆఫీసర్‌ని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లి పోయాడు.

ఈ విషయాన్ని శ్రీనగర్ మేయర్ పర్వైజ్ అహ్మద్ ఖాద్రీ తన ట్విట్ట్ర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. పోలీస్ అధికారి సందీప్ చౌదరిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతడి ఔదార్యానికి హాట్సాఫ్ చెబుతున్నారు.

Tags

Next Story