Steel Plants: ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరిస్తాం.. లేదంటే మూసివేస్తాం: మంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్

Anurag Singh
Steel Plants: ప్రభుత్వరంగ వాణిజ్య పరిశ్రమలన్నీ సాధ్యమైనంతవరకు ప్రైవేటీకరిస్తాం.. అదీ వీలుకాకపోతే మూసివేత గురించి ఆలోచిస్తాం అని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకుర్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ప్రభుత్వరంగ ఉక్కు కర్మాగారాల విక్రయం, ప్రైవేటీకరణపై ఒడిశాకు చెందిన బిజద సభ్యుడు సస్మిత్‌పాత్ర అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గత ఐదేళ్లలో ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణకు అనుమతిచ్చినట్లు చెప్పారు. 2021 జనవరి 27న విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదముద్ర వేసినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరి 4న కొత్త ప్రభుత్వరంగ సంస్థల విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు.
ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలకు వర్తిస్తుందని చెప్పారు. ఈ విధానం ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వరంగ వాణిజ్య సంస్థలను స్టాటజిక్, నాన్‌స్టాటజిక్ రంగాలుగా విభజించినట్లు తెలిపారు.
నాన్‌స్టాటజిక్ రంగంలోని ప్రభుత్వరంగ సంస్థలను సాధ్యమైనచోట ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తామని, లేదంటే మూసివేత గురించి ఆలోచిస్తామని తెలిపారు. ఉక్కు పరిశ్రమ నాన్‌స్టాటజిక్ రంగంలోకి వస్తుందని మంత్రి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com