'నిర్మా' పాప నవ్వుల్లో విషాదం.. పేరు వెనుక పెద్ద కథ

నిర్మా పాప నవ్వుల్లో విషాదం.. పేరు వెనుక పెద్ద కథ
X
NIRMA: నిర్మా డిటర్జంట్ పౌడర్ 1990 దశంలో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ పౌడర్ మార్కెట్లోకి రాకముందు నిర్మా అని పేరు పెట్టడానికి దానివెనక ఓ కథ దాగివుంది.

NIRMA: వాషింగ్ పౌడర్ నిర్మా.. డిటర్జంట్ బిల్లా నిర్మా.. పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది రంగుల బట్టలే తళతళగా మెరిసాయి అనే సాంగ్ వినే ఉంటారు. నిర్మా డిటర్జంట్ పౌడర్ 1990 దశంలో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ పౌడర్ మార్కెట్లోకి రాకముందు నిర్మా అని పేరు పెట్టడానికి దానివెనక ఓ కథ దాగివుంది. అదేంటో తెలుసుకుందాం..

వ్యాపారం చేయాలని అందరూ అనుకుంటారు.. కానీ దానికి తగిన కార్యాచరణ రూపొందించి సక్సెస్ అయ్యేవారు చాలా తక్కువమంది ఉంటారు. వ్యాపార రంగంలో గుజరాతీయులను మించిన వారు లేరని చెప్పడంలో సందేహం లేదు. దేశంలో ఉన్న 30 శాతం వ్యాపారవేత్తలు గుజరాత్ వారే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు కర్సాన్ భాయ్ పటేల్. ఆయన కూతురు పేరు నిరుపమ.. ముద్దు పేరు నిర్మా... ఈ పేరునే కర్సాన్ భాయ్ తన డిటర్జెంట్‌ పౌడర్‌కి పెట్టారు.

కర్సాన్ భాయ్ రసాయన శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. గుజరాత్‌ రాష్ట్ర మైనింగ్‌ శాఖలో ఉద్యోగిగా చేరారు. అయితే కెమికల్‌ ఇంజనీరుగా డిగ్రీ పొందిన ఆయన ఊరికే ఉండలేకపోయాడు. ఎప్పుడూ రసాయనాలతో కుస్తీ పడుతుండే వాడు. డిటర్జెంట్‌ పౌడర్‌ తయారు చేయాలని అనుకున్నారు. తన రీసెర్చ్ ఫలించి 1969లో నిర్మా డిటర్జెంట్ పౌడర్ బయటకు వచ్చింది.

అయితే కర్సాన్ భాయ్ జీవితంలో ఓ విషాదం చోటు చేసుకుంది. ఎప్పుడు కాస్త ఖాళీ దొరికినా కూతురుతో కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలో ఆయన ముద్దుల కూతురు నిరుపమ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇకలేదన్న ఆలోచనలు కర్సన్‌భాయ్‌ని నిద్రపట్టనివ్వకుండా చేశాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలన్న తపన అతనిలో అలానే ఉండిపోయింది. దాంతో తాను రూపొందించిన డిటర్జెంట్‌ పౌడర్‌కి తన కూతురు నిరుపమ ముద్దు పేరైన నిర్మాని తన ప్రోడక్ట్‌కి పెట్టారు.

నిర్మాను ఎలాగైనా వృద్ధిలోకి తేవాలనే లక్ష్యంతో గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కార్లలో తిరిగిన కర్సాన్ భాయ్.. సైకిల్ తొక్కుతూ ఇంటింటికి తిరిగాడు. ప్రతి గడపకు వెళ్లి మహిళలను పలకరిస్తూ నిర్మా డిటర్జెంట్‌ని పరిచయం చేశాడు. ఈ డిటర్జెంట్‌ పౌడర్‌ను కేజీ రూ.3 లకే అమ్మడం ప్రారంభించాడు. అప్పటి వరకు మార్కెట్‌లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బడా సంస్థలు ఒక్కసారిగా వణికిపోయాయి. నాణ్యత ఎక్కువ, ధర తక్కువ కావడంతో గుజరాత్‌లో నిర్మా బ్రాండ్‌ ఊహించని స్థాయికి ఎదిగింది.

నిర్మా యాడ్ ఆ స్థాయిలో సక్సెస్‌ కావడానికి కారణం కూతురిపై కర్సన్‌భాయ్‌కి ఉన్న ప్రేమ. కూతురు రూపం చిరస్థాయిగా ఉండేలా నిర్మాపై డిజైన్‌ చేయించాడు. ముందుగా తెల్ల గౌనులో ఓ పాపను గుండ్రంగా తిప్పించి.. ఈ స్టిల్‌ ఫ్రీజ్‌ చేసే సమయంలో తన కూతురు చిత్రం వచ్చేలా ప్లాన్‌ చేశాడు. ఈ ప్లాన్‌ బాగా వర్క్‌అవుట్‌ అయ్యింది.

2004 నాటికే దేశంలో నంబర్‌ వన్‌ బ్రాండ్‌గా కొనసాగుతూ సాలీనా 8 లక్షల టన్నుల డిటర్జెంట్‌ పౌడర్‌ తయారు చేస్తున్న సంస్థగా నిర్మా రికార్డు సృష్టించింది. నిర్మా బ్రాండ్‌ని దేశంలోనే నంబర్‌ వన్‌గా మార్చిన తర్వాత తన కూతురి జ్ఞాపకాలను మరింత సజీవంగా ఉంచుకునేందుకు కర్సన్‌భాయ్‌ పటేల్‌ విద్యారంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అహ్మదాబాద్‌లో 1995లో నిర్మా ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పేరుతో ఫార్మసీ కాలేజీ స్థాపించారు. దీన్నే 2003లో నిర్మా యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు.

వ్యాపార రంగంలో కర్సన్‌భాయ్‌ పటేల్ సేవలకు కేంద్ర ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. ఇక ఫోర్బ్స్‌ వివరాల ప్రకారం 2019లో రూ, 42,000 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో దేశంలోనే 30వ స్థానంలో ఉన్నాడు. ఇక ప్రపంచ స్థాయిలో 775వ స్థానంలో కర్సన్‌భాయ్‌ నిలిచారు.అయితే కూతురి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు ఆయన చేసిన ప్రయత్నం ప్రపంచ రికార్డుకు కారణమైంది. పాప పేరుతో స్థాపించిన ఆ సంస్థలో 14 వేల మంది పని చేయడం అది కర్సన్ భాయ్‌కు అత్యంత సంతృప్తినిచ్చే విషయం.

Tags

Next Story