చిన్నారి భవిష్యత్‌కు భద్రతనిచ్చే పథకం.. సుకన్య సమృద్ధి యోజన

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న కుటుంబాలు ఇంకా ఆడపిల్లను బరువుగానే భావిస్తున్నాయి. ప్రభుత్వం బాలికల భవిష్యత్ కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటుంది. అవి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుంటాయి. భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా 2015లో సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) పథకాన్ని ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. చిన్నారి భవిష్యత్తుకి ఆర్థిక భరోసా కల్పించేందుకు, ఉన్నత విద్యకు, వివాహ సమయాల్లో తోడ్పాటునిస్తుంది.
అమ్మాయి పుట్టిన తరువాత ఆమెకు పది సంవత్సరాల వయస్సు వచ్చే లోపు ఎప్పుడైనా ఈ ఖాతాను తెరవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షుడు రెండు ఖాతాలు మాత్రమే తెరిచేందుకు వీలుంది. దత్తత తీసుకున్న బాలిక పేరుపై కూడా ఈ ఖాతా తెరవచ్చు. కానీ ఒకరి కోసమే రెండు ఖాతాలు తీసుకుంటానంటే కుదరదు.వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామా గుర్తింపు పత్రాలతో పాటు జనన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
సుకన్య సమృద్ధి ఖాతా మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు. ఉదాహరణకు 8 సంవత్సరాల వయసులో ఖాతా ప్రారంభిస్తే, అమ్మాయికి 29 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మెచ్యూరిటీ పూర్తవుతుంది. సుకన్య సమృద్ధి ఖాతా నుంచి అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత డబ్బు తీసుకునే వీలుంది.
ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు మధ్యలో ఎప్పుడైనా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఖాతాను ప్రారంభించేందుకు కనీస డిపాజిట్ ఏడాదికి రూ.250లు. గరిష్టంగా రూ.1.5 లక్షలు. ఒక ఖాతాలో సంవత్సరానికి అంతకంటే ఎక్కువగా డిపాజిట్ చేయకూడదు. ఖాతా తెరిచిన సంవత్సరం నుంచి 14 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ ఇద్దరు అమ్మాయిలు ఉంటే రెండు ఖాతాలలో మొత్తం రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
నగదు లేదా చెక్కు లేదా డిమాండ్ డ్రాప్ట్ (డీడీ) రూపంలో డబ్బును డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో చెలించొచ్చు. అలాగే ఒక నెల లేదా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని సార్లైనా డిపాజిట్ చేయవచ్చు. బ్యాంకుకు తగిన సూచనలు అందించడం ద్వారా ఆన్‌లైన్ నుంచి డిపాజిట్ చేయవచ్చు. అదే విధంగా 21 సంవత్సరాల తర్వాత ఖాతాలో ఉన్న నగదును ఉపసంహరించుకోకపోతే ఆ మొత్తంపై వడ్డీ చెల్లించరు.
సుకన్య సమృద్ధి ఖాతాపై ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లను ప్రభుత్వం సవరిస్తుంటుంది. ఖాతా తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల పాటు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు చేయవచ్చు. అయితే ఈ ఖాతాలో ప్రతినెల 10వ తేదీ కంటే ముందు నగదు డిపాజిట్ చేస్తే నెలంతటికీ వడ్డీ వస్తుంది. ఈ పథకంపై వడ్డీ రేటు ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి ఏ బ్యాంకునుంచైనా ఖాతాను ప్రారంభించవచ్చు.సంవత్సరానికి రూ.1000 కనీస పెట్టుబడి 15 సంవత్సారాల పాటు పెట్టినట్లైతే 21 సంవత్సరాలు పూర్తయిన తరువాత మెచ్యూరిటీ సమయంలో రూ.46,800 పొందవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com