సుకన్య సమృద్ధి యోజన vs చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్: పిల్లల భవిష్యత్తుకు ఏది మంచిది?

సుకన్య సమృద్ధి యోజన vs చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్: పిల్లల భవిష్యత్తుకు ఏది మంచిది?
విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నాయి.

విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నాయి. పిల్లలకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని, ఉన్నతంగా వారిని చూడాలని తల్లిదండ్రులు కలలు కంటారు. అందుకోసం పొదుపు చేస్తారు..

సరైన ప్రణాళికతో పెట్టుబడులు పెట్టడం అవసరం. సంపాదిస్తున్న తల్లిదండ్రులు దురదృష్టవశాత్తూ మరణిస్తే బిడ్డల భవిష్యత్ అంధకారం కాకూడదు. ఇందుకు ఆర్థికభద్రత చాలా ముఖ్యం. సుకన్న సమృద్ధి యోజన లేదా చైల్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌లో ఏది ముఖ్యం అనేది తెలుసుకుని ముందుకు వెళ్లాలి.

మీ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి సుకన్య సమృద్ధి యోజన (SSY), చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి వివరంగా..

సుకన్య సమృద్ధి యోజన

ఆడపిల్లకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వారి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవవచ్చు.

లాభాలు:

సుకన్య సమృద్ధి యోజన పూర్తిగా ప్రమాద రహితమైనది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పై అందించే రేటు కంటే ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది. SSY మెచ్యూరిటీ వ్యవధి 21 సంవత్సరాలు. బాలికకు 18 ఏళ్లు నిండినప్పుడు బ్యాలెన్స్‌లో 50 శాతం తీసుకోవచ్చు. ఈ డబ్బును బాలిక చదువు అవసరాలకు వినియోగించొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 21 సంవత్సరాలు అయినప్పటికీ, 18 ఏళ్లు నిండిన తర్వాత లబ్దిదారుడు ఆడపిల్ల వివాహం చేయాలనుకుంటే, SSY ఖాతా ముందుగానే మూసివేయవచ్చు. మొత్తం బ్యాలెన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు. SSY ఖాతాలలో పెట్టుబడులు పన్ను ప్రయోజనాలను పొందుతాయి.

పరిమితులు:

SSY ఖాతాలు బాలికల కోసం మాత్రమే ఏర్పాటు చేసిన పథకం. కాబట్టి, అబ్బాయిల కోసం తల్లిదండ్రులు ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి. సంపాదనలో ఉన్న తల్లిదండ్రులు మరణించిన సందర్భంలో, SSYలో పెట్టుబడులు కొనసాగించే అవకాశాలు ఆగిపోతాయి. ఏ అవసరం కోసమైతే ఇందులో పెట్టుబడి పెడతామో ఆ అవసరం నెరవేరకుండా పోతుంది.

చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్

SSY లాగా, చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు కూడా పిల్లల ఉన్నత చదువులు, వివాహం మొదలైన వాటి కోసం ఆర్థిక అవసరాలను తీర్చే లక్ష్యంతో ఉన్నాయి.

లాభాలు:

చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు సాధారణంగా ప్రీమియం మాఫీ బెనిఫిట్ (PWB) ఎంపికతో వస్తాయి. ఇది సంపాదిస్తున్న తల్లిదండ్రులు దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో ప్రీమియం చెల్లించకుండానే పాలసీ కొనసాగుతుంది. ఈ బీమా పథకం బాలికలు, బాలురుకు ఇద్దరికీ వర్తిస్తుంది. తల్లిదండ్రులు మెచ్యూరిటీ వ్యవధిని ఎంచుకునే సౌలభ్యాన్ని కలిగి ఉంటారు. SSY వలె, చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో పెట్టుబడులు కూడా పన్ను ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

పరిమితులు:

తక్కువ బోనస్ రేటుతో, అధిక ప్రీమియం చెల్లింపులకు దారితీసే హామీ మొత్తాన్ని (SA) ఎంచుకోవాలి.

దేనిని ఎంచుకోవాలి?

ఆకర్షణీయమైన రాబడితో పాటు పూర్తి పన్ను ప్రయోజనాలతో కూడిన పథకం SSY. ఇది అమ్మాయిలకు రిస్క్ లేని పెట్టుబడి ఎంపిక.

ఖరీదైన చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లకు బదులుగా, తల్లిదండ్రులు చవకైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ (MF) లేదా ఇతర వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు.

Tags

Next Story