వ్యవసాయ చట్టాలపై నేడు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ..!

వ్యవసాయ చట్టాలపై నేడు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ..!
నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ధర్నా అంశాలపై సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు వెలువరించనుంది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ధర్నా అంశాలపై సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు వెలువరించనుంది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం చర్యల పట్ల నిరాశతో ఉన్నామని తెలిపింది. చట్టాలకు వ్యతిరేకంగా దేశామంతా తిరుగుబాటులో ఉందని వ్యాఖ్యానించింది. రైతులతో ఏం మాట్లాడుతున్నారని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. గత నెలలో జరిగిన విచారణ సమయంలోనే మిమ్మల్ని ఈ విషయం ప్రశ్నించినా కేంద్రం సరిగా స్పందించలేదని సుప్రీం వ్యాఖ్యానించింది.

వ్యవసాయ చట్టాలపై నూతన కమిటీ ఏర్పాటే మార్గాంతరని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. చట్టాలపై స్టే ఇవ్వడంవల్ల తాము నష్టపోతామని అనేక రాష్ట్రాల రైతులు చెబితే ఏం చేస్తారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నపుడు.... చట్టాలను తాము సమర్థిస్తున్నాం అనే మాటను ఆ రైతులు కమిటీకి చెప్పుకోమనండి అని సీజే బదులిచ్చారు.

చట్టాలు రద్దు చేయాలని తాము చెప్పట్లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కోర్టు జోక్యం చేసుకోవాలా..? వద్దా..? అనే అంశంపై అర్థం లేని వాదనలు వింటున్నామని వ్యాఖ్యానించింది. సమస్యకు పరిష్కారం కనుగొనడమే తమ లక్ష్యమని ధర్మాసనం తేల్చిచెప్పింది. మీరు చట్టాన్ని కొంతకాలం నిలిపివేయగలరా? అని ఏజీని ప్రశ్నించింది.

చర్చల ప్రక్రియ కొనసాగిస్తున్నామని అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. సందిగ్ధత తొలగింపు కోసం కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నామని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలో... వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తుందా... కమిటీ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story