Surat: 9 ఏళ్లకే సన్యాసం....

Surat: 9 ఏళ్లకే సన్యాసం....
తొమ్మిదేళ్ల పసి ప్రాయంలోనే సన్యాసం స్వీకరించిన చిన్నారి; సూరత్ లో చోటుచేసుకున్న ఘటన..

నచ్చిన బొమ్మ కొనమని మారం చేసే వయసులో పరిణితికి మించి నిర్ణయం తీసుకుంది ఓ చిన్నారి. వజ్రాల వ్యాపారి ఇంట పుట్టి అష్టైశ్వర్యాలను వద్దనుకుని సన్యాసం పుచ్చుకుంది. ఈ విపరీత ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకుంది.


గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ధనేశ్, అమీ సంఘ్వీకి ఇద్దరు కూతుళ్లు. 3దశాబ్దాల చరిత్రగల సంఘ్వీ అండ్ సన్స్ కు ధనేశ్ ఏకైక వారసుడు కాగా, ఇతని పెద్దమ్మాయి దేవాన్షి కుటుంబ అంగీకారంతో అత్యంత చిన్న వయసులోనే సన్యాసినిగా మారింది.


దేవాన్షి జైన్ మతగురువు ఆచార్య క్రితియాషురి సమక్షంలో వందలాది బంధువల సాక్షిగా దీక్షను స్వీకరించింది. దీక్ష తీసుకున్న తరువాత దేవాన్షి ఐహిక జీవితంలో సకల సౌకర్యాలను త్యజించనుంది.


చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో చూరుక్కా పాల్గొనేదని దేవాన్షి బంధువులు తెలిపారు. ఒకానొక సమయంలో ఇతర సన్యాసులతో కలసి ఆమె 700 కిలోమీటర్ల యాత్రలో పాలుపంచుకుందని తెలుస్తోంది. సన్యాసినిగా మారక ముందే ఆ జీవితాన్ని ఆశ్వాదించేదని తెలుస్తోంది. 5 భాషల్లో చకచకా మాట్లాడగలిగే దేవాన్షికి నాలుగేళ్ల చెల్లి కూడా ఉంది.

Tags

Next Story