Tamil Nadu: పంచలోహ విగ్రహాలకు అన్ని కోట్లా..

Tamil Nadu: తమిళనాడులో చోళ రాజులు కట్టించిన ఆలయ తవ్వకాల్లో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విగ్రహాలు అతిపురాతనమైనవి కావడంతో వాటి విలువ కొన్ని కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. నాగపట్నం జిల్లాలోని దేవపురి స్వరాలయం అతి ప్రాచీనమైనది. ఈ శివాలయాన్ని చోళ రాజుల కాలంలో నిర్మించారు. స్థలపురాణంలో ఆలయం విశిష్టత గురించి గొప్పగా వివరించడంతో నిత్యం ఆలయంలో వేలసంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుంది. ఈ క్రమంలో ఆలయంలో మరమ్మతులకు మండపంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో అతి ప్రాచీనమైన పంచలోహ విగ్రహం బయటపడింది.
దీంతో వెంటనే గ్రామస్థులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు జేసీబీ సహాయంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో మరిన్ని చోట్ల తవ్వకాలు జరిపించారు. దీంతో అక్కడ 14 అతిపురాతనమైన పంచలోహ విగ్రహాలు, 10 కి పైగా పూజలకు ఉపయోగించే సామాగ్రి బయటపడ్డాయి. పురావస్తు శాఖ అధికారులు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై పరిశోధనలు చేయనున్నామని తెలిపారు. చోళ రాజులకాలం నాటి ఈ విగ్రహాల విలువ కోట్లలో ఉంటుంది కనుక.. గట్టి భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శివాలయంలోని మండపంతో సహా అన్ని ప్రాంతాల్లో మరిన్ని తవ్వకాలను జరపాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com