Tamil Nadu Govt : స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూల్లో చదివితే నెలకి రూ. 1,000

Tamil Nadu Govt : తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉన్నత చదువులకి వెళ్ళే బాలికలకి అండర్ గ్రాడ్యుయేట్ పూర్తయ్యే వరకు ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున నెలవారీ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం సమర్పించిన బడ్జెట్‌లో ప్రకటించింది.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని ఆడపిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ వెల్లడించారు.. దీనికి విద్యా భరోసా పథకం అని నామకరణం చేశారు. కాగా ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు లక్షల మంది విద్యార్ధినిలకు లబ్ది చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులు అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసే వరకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయబడుతుందని తెలిపారు. ఈ కొత్త పథకానికి ఈ బడ్జెట్‌లో రూ.698 కోట్లు కేటాయించారు.
విద్యలో ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికల నమోదు శాతం చాలా తక్కువగా ఉందని గుర్తించిన ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతుంది. ఇక వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.1000 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త హాస్టళ్లు, ల్యాబొరేటరీలు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటుకు ప్రత్యేక పథకం అమలు చేస్తామని, ఈ బడ్జెట్‌లో వాటికి గాను రూ.250 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు.
ఈ బడ్జెట్‌లో ఉన్నత విద్యాశాఖకు మొత్తం రూ.5,668.89 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.36,895.89 కేటాయించింది డిఎంకె ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com