రెడీ అయిపోండి.. పద్యాలు చెబితే పెట్రోల్ ఫ్రీ!

ఈ రోజుల్లో ఇంగ్లీష్ అంటే గలగల మాట్లాడగలం కానీ పద్యాలు అంటే చాలా మందికి అస్సలు నోరు కూడా తిరగదు. పద్యం అంటే చాలు మా వల్ల కాదు బాబోయ్ అని చేతులెత్తేస్తారు కూడా.. అయితే ఇది బాషాపండితులను, కవులను కలిచివేస్తోంది.
అయితే తమిళనాడుకు చెందిన కె సెంగుత్తువన్ అనే ఓ బాషాపండితుడు ఓ అద్భుతమైన ఉపాయాన్నిఆలోచించాడు. ఇంతకీ ఆ ఉపాయం ఏంటంటే.. తన పెట్రోల్ బంకులో 'పద్యం చెప్పి పెట్రోల్ పట్టుకెళ్లు' అనే ఓ ఆఫర్‌ను ప్రకటించాడు. 20 ద్విపద పద్యాలు చెప్తే ఒక లీటర్, 10 పద్యాలు చెప్తే అర లీటర్ పెట్రోల్ ఉచితమని వెల్లడించాడు.
జనవరి 16న ప్రకటించిన ఈ ఆఫర్ ఏప్రిల్ 30తో ముగియనుంది. అసలే పెట్రోల్ రేట్స్ అందరికీ చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి ఆఫర్ వస్తే ఎవరోద్దంటారు చెప్పండి. ఇంట్లో పిల్లలను కూర్చోబెట్టి మరీ పద్యాలు నేర్పించి.. నేరుగా కరూర్ జిల్లాలోని పెట్రోల్ పంపుకు తీసుకువెళ్తున్నారు.
అయితే దీనిపైన సెంగుత్తువన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో యువత, పిల్లలు ఎక్కువగా ఫోన్ లకు బానిస అయ్యారు.. ఇక లాక్‌డౌన్ సమయంలో పిల్లలు అయితే మరీను.. అందుకే వారు ప్రముఖ తిరుక్కురళ్ పద్యాలు నేర్చుకోవాలన్న కాంక్షతోనే ఈ ఆఫర్ పెట్టినట్టుగా వెల్లడించాడు.
అయితే ఇది కేవలం ఒకసారి మాత్రమే లాంటి ఆంక్షలేమీ లేవని, రెండోసారి ఈ ఆఫర్ అందుకోవాలంటే మళ్లీ కొత్త పద్యాలు అప్పజెప్పాల్సిందే నని అన్నారు. కాగా ఇప్పటివరకు 176 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com