Tamilisai Soundararajan : ఢిల్లీ చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసై.. అమిత్‌షాతో నేడు భేటీ

Tamilisai Soundararajan : తెలంగాణ గవర్నర్ తమిళిసైకు, సీఎం కేసీఆర్‌కు మధ్య గ్యాప్ పెరిగిన నేపథ్యంలో.... ఆమె ఢిల్లీ టూర్ ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర హోంశాఖ నుంచి పిలుపురావడంతో.. ఆమె ఢిల్లీ చేరుకున్నారు. వాస్తవానకి సోమవారమే వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల అప్పుడు రద్దు అయింది. ఎట్టలకేలకు హస్తినకు చేరుకున్న గవర్నర్... కేంద్రమంత్రి అమిత్ షాతో తమిళిసై ఇవాళ భేటీ కానున్నారు.
మరోవైపు .... ఇప్పటికే.. సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉండి... ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 11న ఢిల్లీలో ధర్నా చేయాలని టీఆర్‌ఎస్ నేతలకు ఆదేశించారు. ఈ సమయంలో... కేంద్రం నుంచి గవర్నర్‌కు పిలుపురావడం ఉత్కంఠ రేపుతోంది.
ఇటీవల గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, యాదాద్రిలో ప్రొటోకాల్ పాటించకపోవడం వంటి అంశాలను సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో తాను ఎవరికీ భయపడే ప్రసక్తేలేదని, తాను శక్తివంతురాలనినంటూ… తనను ఎవరూ నియంత్రించలేరంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యాలూ చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలు సీఎం కేసీఆర్‌నుద్దేశించే అన్నారనే ప్రచారం జరిగింది.
ఇలాంటి నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షాతో.. తమిళసై భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో తెలంగాణ పరిస్థితులు, తాజా పరిణామాలపై.. అమిత్‌షాకు గవర్నర్ తమిళసై... ఓ నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ సర్కారు సహాయ నిరాకరణపై కూడా రిపోర్టు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వరిపోరుతో పాటు కేంద్రంపై టీఆర్‌ఎస్ చేస్తోన్న పోరాటాలపై ఎలాంటి రిపోర్ట్ ఇస్తారన్నదానిపై చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com