తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపులు.. కమల్ హాసన్ కీలక నిర్ణయం

తమిళనాడులో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మక్కల్ నీధి మయ్యమ్ అధినేత, నటుడు కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో శరత్‌కుమార్ పార్టీ ఆలిండియా సముత్వ మక్కల్ కట్చీ తో కలిసి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు చెన్నైలో జరిగిన సమావేశంలో ఇరువురి మధ్య పొత్తు కుదిరింది. ఎన్నికల్లో కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టి ఉంటే జత కడుదామనుకున్నారు కమల్. అయితే రజనీ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో కోలీవుడ్‌లోని పలువురు బడా హీరోలతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు కమల్ హాసన్ వ్యూహరచన చేశారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవటంతో తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, అగ్ర నటుడు కమల్ హాసన్ బుధవారం తన పార్టీ ఎన్నికల ఎజెండాను వెల్లడించారు. మహిళల సంక్షేమానికి తమ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. మహిళల రక్షణ కోసం 181 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే గ్రామీణ బ్యాంక్‌లను మహిళా పథకాల ఆధ్వర్యంలో నిర్వహించేలా కొత్త ప్రతిపాదనలు తీసుకువస్తాని ఎంఎన్‌ఎం పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించింది. మరోవైపు.. రానున్న ఎన్నికల్లో కమల్ హాసన్ చెన్నై నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎంజీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో పాటు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్ఎన్ఎమ్ పార్టీకి ఇక్కడ దాదాపు 10శాతం ఓట్లను కైవసం చేసుకుంది. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 7వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com