తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. రజనీకాంత్‌తో అమిత్ షా చర్చించే అవకాశం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. వివిధ పార్టీల నేతల చేరికలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నై పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమిత్ షా చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో తమిళనాడు బీజేపీ నేతలు అమిత్‌షాకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి లీలాప్యాలెస్‌కు బయల్దేరారు. సాయంత్రం చేపాక్‌లోని కళైవానర్ అరంగం చేరుకుంటారు. తేర్వాయ్‌కండ్రిగ జలాశయాన్ని జాతికి అంకితం చేస్తారు. లీలాప్యాలెస్ హోటల్‌కు చేరుకుని, బీజేపీ రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ నాయకులతో సమావేశమవుతారు. రాత్రి హోటల్‌లోనే బసచేసి.. ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు మీనంబాక్కం విమానాశ్రయం చేరుకుని, ఢిల్లీ బయల్దేరతారు.
డీఎంకే నుంచి సస్పెండయిన మాజీ ఎంపీ కేపీ రామలింగం... బీజేపీలో చేరారు. డీఎంకే ప్రముఖ నేత ఎంకే అళగిరికి విధేయుడైన రామలింగం.. అళగిరిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో రామలింగం చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
అటు..అమిత్‌షా సినీ నటుడు రజనీకాంత్, డీఎంకే మాజీనేత ఎంకే అళగిరితోనూ సమావేశమవుతారని తెలుస్తోంది. రజనీకాంత్‌ను అమిత్‌షా నేరుగా కలుసుకునే వీలు లేకుంటే వీడియో కాల్ చేసి మాట్లాడతారని తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించాలంటూ అమిత్‌షా రజనీకాంత్‌ను కోరనున్నట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్న అళగిరిని బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్‌షా మంతనాలు జరుపుతారని సమాచారం.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com