తమిళనాడుపైనా దృష్టి పెట్టిన మజ్లిస్

హైదరాబాద్ కేంద్రంగా ప్రస్థానం మొదలుపెట్టి... దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తున్న ఎంఐఎం... తమిళనాడుపైనా దృష్టి పెట్టింది. ఇటీవల బీహార్‌లో 5 ఎమ్మెల్యే సీట్లు గెల్చుకున్న మజ్లిస్.. తమిళనాట కూడా సత్తా చాటాలని భావిస్తోంది. 2021 ఏప్రిల్‌లో లేదా మేలో జరిగే ఎన్నికల్లో 25 స్థానాలకు తగ్గకుండా ఎంఎంఐ పోటీ చేయనుందని తెలుస్తోంది. కమల్ హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో జట్టుకట్టే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోని మజ్లిస్ ఆఫీసులో తమిళనాడు ఎంఐఎం నేతలతో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఎంఐఎం.... ఐదు స్థానాల్లో విజయం సాధించింది. హైదరాబాద్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టు నిలుపుకుని 44 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు తమిళ ఎన్నికలపై దృష్టి సారించింది. తమిళనాడులోని పలు ముస్లిం పార్టీలు ఉన్నప్పటికీ అవి ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలను ఏకం చేసి.. ఎన్నికల్లో పాల్గొనాలని ఒవైసీ యోచిస్తున్నారు. కమల్ హసన్ పార్టీ, నామ్ తమిళర్ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. వెల్లూర్, రాణిపేట్, తిరుపత్తూర్, కృష్ణగిరి, త్రిచీ, తిరునెల్వేలి జిల్లాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఆ ప్రాంతాలతో పాటు మరికొన్నింటిల్లో పోటీ చేసేందుకు మజ్లిస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com