Ranganatha Temple: శ్రీరంగం ఆలయానికి కేసీఆర్.. ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే..

Ranganatha Temple: దేవాలయాలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలు.. ఆలయాల్లో అడుగడుగునా కనిపించే శిల్పకళానైపుణ్యం కళాకారుల ప్రతిభకు తార్కాణం. పురాతన ఆలయాలకు ప్రసిద్ధి మన భారతదేశం. ముఖ్యంగా తమిళనాడులోని తిరుచిరాపల్లి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ద్రవిడ నిర్మాణ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయంలో విష్ణువు యొక్క వివిధ రూపాలు భక్తులను కనువిందుచేస్తాయి.
156 ఏకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఒకటి. ఆలయంలోని విష్ణుమూర్తి శయనరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ఆలయం భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆలయంలో 21 గోపురాలు, 39 మంటపాలు ఉన్నాయి. 236 అడుగుల ఎత్తులో నిర్మించబడిని రాజగోపురం ఆలయ ప్రధాన గోపురంగా చెప్పబడింది.. ఇది ఆసియా ఖండంలోని రెండవ ఎత్తైన ఆలయ గోపురం.
ఈ ఆలయంలో 1000 స్థంభాలతో రూపొందిన అతి పెద్ద హాలు మరో ప్రత్యేకత. ఇక స్వామి వారి విగ్రహం కూడా తేనె, కర్పూరం, గంధం, బెల్లం, కస్తూరి, తైలం ఉపయోగించి తయారు చేశారు.
ఈ ఆలయం 10వ శతాబ్థానికి పూర్వమే నిర్మించబడినట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఆలయంలోని శాసనాలు చోళ, పాండ్య, హోయసల మరియు విజయనగర రాజవంశాలకు చెందినవి. 13వ శతాబ్ధంలో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ప్రముఖ జనరల్ మాలిక్ కాపుర్ సైన్యం ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది.
ఆలయాన్ని ముట్టడించి స్వామి విగ్రహాన్ని చోరీ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి భక్తులు మిన్నకుండక చక్రవర్తితో తలపడేందుకు ఢిల్లీ వెళ్లారు. దేవుని పట్ల వారికి ఉన్న భక్తికి, విశ్వాసానికి పరవశించిన చక్రవర్తి తమ సైన్యం చోరీ చేసిన విష్ణుమూర్తి విగ్రహాన్ని వారికి తిరిగి అప్పగించేందుకు సంసిద్దుడయ్యాడు. సరిగ్గా అదే సమయంలో మాలిక్ కాపుర్ కుమార్తె 'సురతాని' విష్ణుమూర్తి ప్రేమలో పడింది. విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన భక్తులతో పాటు ఆమె కూడా శ్రీరంగానికి బయలుదేరింది.
ఆలయంలోని గర్భగుడి ముందు దేవునికి సాష్టాంగ నమస్కారం చేసింది. వెనువెంటనే ఆమెకు స్వర్గలోకం ప్రాప్తించిందని భక్తులు విశ్వసిస్తారు. నేటీకీ గర్భగుడి పక్కనే ఉన్న అర్జున మండపం దగ్గర ఉన్న ఆమె మందిరంలో 'సురతని' పెయింటింగ్ ఉంటుంది. ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతి రోజు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com