ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్.. ఏదైనా ఇప్పుడే.. త్వరలో ధరలు భారీగా..

ఎండాకాలం రాలేదుగా ఏసీ ఇప్పుడే ఎందుకనుకుంటే పెరగనున్న ధరలు చూస్తే చలికాలంలోనే చెమటలు పట్టేస్తాయి.. త్వరలో వైట్ గూడ్స్ ధరలు పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయం పెరుగుతుండడంతో ఎలక్ట్రానిక్ గూడ్స్ ధర పెంచక తప్పట్లేదంటున్నాయి కంపెనీ యాజమాన్యాలు. ఎల్‌సీడీ/ఎల్‌ఈడీ ప్యానెళ్లపై 5 శాతం సుంకం విధించడం, భవిష్యత్తులో ఈ సుంకం మరింత పెరగనుండడంతో టీవీల ధరలు కొండెక్కనున్నాయి.
ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారీలో వినియోగించే రాగి, జింక్, అల్యూమినియం, ఉక్కు, ప్లాస్టిక్ తదితర వస్తువుల ధరలు గత ఐదు నెలల్లోనే 40-45 శాతం మేర పెరిగాయి. ఫ్రిజ్‌లు, చెస్ట్ ఫ్రీజర్లలో ఉపయోగించే ఫోమ్స్ తయారీలో వాడే ఎమ్‌డీఐ కెమికల్ ధర 200 శాతం పెరిగింది. ఇక ప్లాస్టిక్ ధరలైతే 30-40 శాతం పెరిగాయి. మరోవైపు సముద్ర రవాణా 40-50 శాతం మేర పెరిగింది.
వైట్ గూడ్స్ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కరెన్సీ మారకం రేటు కాస్త నిలకడగా ఉండడంతో ధరలు ఈస్థాయిలో ఉన్నాయని లేకపోతే మరింత పెరిగేవని నిపుణులంటున్నారు. మరోవైపు ఏసీ, ఫ్రిజ్‌లకు ఎనర్జీ లేబులింగ్ నిబంధనల అప్‌గ్రేడ్‌ను మరో రెండేళ్ల పాటు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ వాయిదా వేసింది. ఇది కూడా ధరల పెరుగుదలను నియంత్రించింది.
అసలైతే పండుగ సీజన్‌లోనే ధరలు పెంచాల్సి ఉండగా అది సేల్స్‌పై ప్రభావం చూపిస్తుందని కంపెనీలు వాయిదా వేశాయి. ఇప్పుడు పండగ సీజన్ పూర్తికావడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల చివర్లో కానీ, వచ్చే నెల మొదట్లో కానీ ధరల పెంపుదల ఉండొచ్చని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
అయితే కొన్ని కంపెనీలు ఈ ధరల పెరుగుదలను అంగీకరించలేకపోతున్నారు. కారణం కరోనా కారణంగా కుదేలయిన మార్కెట్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఇప్పుడు ధరలు పెంచితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని కంపెనీలు భయపడుతున్నాయి. అయితే పెరుగుతున్న ఉత్పత్తి, రవాణా వ్యయాలను భరించే శక్తి కంపెనీలకు లేదు. దాంతో ధరలు పెంచక తప్పట్లేదు. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
టీవీలపై విధించిన సుంకాల ధరలు కూడా ధరల పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. స్థానికంగా వస్తువుల తయారీ ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా సుంకాలను మూడేళ్లలో 8-10 శాతానికి పెంచాలనేది కేంద్రం అభిమతం. దీంతో టీవీల ధరలు 20శాతం మేర పెరిగే అవకాశాలు ఉంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com