అరుదైన చేపలు.. లక్షల్లో ధరలు

అరుదైన చేపలు.. లక్షల్లో ధరలు
చేపలు పడని రోజు పస్తులతో పడుకునే కుటుంబాలకు ఇలాంటి చేపలు పడితే పండగే..

పొద్దున్నే వల భుజానేసుకుని నదీమతల్లికి నమస్కరించి చేపల వేటకు దిగిన జాలరులకు ఆ రోజు చేపలు చిక్కితేనే రోజు గడుస్తుంది. అదే జీవనాధారంగా బ్రతుకుతున్న జాలరులకు ఈ మధ్య కొన్ని ఖరీదైన చేపలు కూడా వలలో చిక్కుతున్నాయి. చేపలు పడని రోజు పస్తులతో పడుకునే కుటుంబాలకు ఇలాంటి చేపలు పడితే పండగే.. జీవితాలు మారకపోయినా కొన్ని రోజులైనా ఇంట్లో తిండి గింజలకు డబ్బులు వెతుక్కోవాల్సిన ఇబ్బంది ఉండదనే ఓ ఆశ వారిని ముందుకు నడిపిస్తుంది. ఇంతకు ముందెప్పుడూ చూడని చేపలు జాలరుల వలలో చిక్కి వారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతున్నాయి. అలా ఈ మధ్య కాలంలో చిక్కిన చేపలు లక్షల ధర పలుకుతున్నాయి.

తెలియా చేప @ రూ.1.43 లక్షలు

తాజాగా ఒడిశా భద్రక్‌లోని తలచూవా ప్రాంతానికి చెందిన ఓ జాలరికి సముద్రంలో 22 కేజీల బరువున్న ఓ చేప చిక్కింది. తన అదృష్టం పండిందనుకున్న జాలరి ఆ చేపను మార్కెట్‌కి తీసుకెళ్లి అమ్మకానికి పెట్టాడు. ఓ వ్యాపారి ఆ చేపను ఏకంగా రూ.1.43 లక్షలకు కొనుగోలు చేశాడు. సాధారణంగా ఇలాంటి చేపలు మత్స్యకారుల వలలకు చిక్కడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ రకం చేపలు ఔషధాల తయారీలో వినియోగిస్తారు. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. మరింత రేటుకి అమ్ముకుంటారు.

కచ్చిలి చేప @ రూ.1.70 లక్షలు..

ఇటీవల ఏపీలోని ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంతంలో దోనిదేవుడు అనే జాలరికి 28 కిలోల బరువున్న కచ్చిలి చేప దొరికింది. దానిని ఓ వ్యాపారి రూ.1.70 లక్షలకు కొనుగోలు చేశాడు.

భోలా ఫిష్ @ రూ.3 లక్షలు..

పశ్చిమ బెంగాల్‌ సుందర్ బన్ అడవుల సమీపంలో ఉన్న సాగర్ దీవుల్లో పుష్పకర్ అనే వృద్ధురాలు జీవిస్తోంది. ఆమె సుందర్ బన్ నదిలో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తుంటుంది. ప్రతి రోజులాగే ఆమె చేపల వేటకు వెళ్లగా నదిలో భారీ చేప తేలియాడుతూ కనిపించింది. భారీ చేపను చూడగానే ఆమె ప్రాణం లేచి వచ్చింది. వెంటనే నదిలోకి దూకి శక్తినంతా కూడగట్టుకుని చేపను ఒక్కర్తే ఒడ్డుకు లాగింది. మిగిలిన జాలరుల సాయంతో ఆ చేపను మార్కెట్‌కు తీసుకువెళ్లింది. 52 కిలోల బరువున్న ఆ చేప అరుదైన భోలా ఫిష్ అని దానికి చాలా డిమాండ్ ఉందని తెలుసుకుంది. ఓ వ్యాపారి రూ.3 లక్షలు చెల్లించి చేపను తీసుకున్నాడు. చేప చనిపోయింది కాబట్టి రూ.3 లక్షలే పలుకుతోందని అదే బతికుంటే మరింత ధర పలికేదని చేపల వ్యాపారస్తులు తెలియజేశారు. దీన్ని కూడా ఔషధ తయారీలో వినియోగిస్తారు. ఈ చేప చర్మానికి మంచి డిమాండ్ ఉంది. కిలో చర్మం దాదాపు రూ.80 వేలు ఉంటుంది అంటే ఈ చేపకున్న డిమాండ్‌ని అర్థం చేసుకోవచ్చు. అదే బతికున్నట్లయితే 52 కిలోలు ఉన్న ఈ చేప రూ.40 లక్షలకు పైగా ధర పలికేదని వ్యాపారులు చెబుతున్నారు.

Tags

Next Story