వేలి ముద్రలతో అకౌంట్‌లో డబ్బులు స్వాహా.. కొత్త రకం మోసం తెరపైకి..

వేలి ముద్రలతో అకౌంట్‌లో డబ్బులు స్వాహా.. కొత్త రకం మోసం తెరపైకి..
యాప్‌లకు లింకులు పంపి సొమ్ములు కొట్టేయడం పాత పద్దతి.. ఇప్పుడు కొత్తగా వేలి ముద్రల సాయంతో ఆధార్ డేటాను దొంగిలించి..

ఎంత అలెర్ట్‌గా ఉన్నా అంతకంటే తెలివి ప్రదర్శిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.. ఓటీపీ అడిగి తెలుసుకుని డబ్బు కాజేయడం, యాప్‌లకు లింకులు పంపి సొమ్ములు కొట్టేయడం పాత పద్దతి.. ఇప్పుడు కొత్తగా వేలి ముద్రల సాయంతో ఆధార్ డేటాను దొంగిలించి ఖాతాదారుడికి తెలియకుండా అకౌంట్‌లోని నగదును స్వాహా చేస్తున్నారు.. నయా మోసానికి తెర తీస్తున్నారు.

ఈ కొత్త తరహా మోసానికి బలైన ఓ వ్యక్తి అతడు మోసపోయిన వైనాన్ని వివరించాడు.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మధురానగర్‌కు చెందిన సిద్ధిరెడ్డి వీర వెంకట సత్యన్నారయణ మూర్తికి .. పశ్చిమ గోదావరి జిల్లా ఆనపర్తిలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంది.

డిసెంబరు 22న అతడి ఖాతా నుంచి రూ.10 వేలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. తనకు తెలియకుండానే డబ్బు విత్ డ్రా అవడంతో.. ఆ డబ్బును ఎవరో చోరీ చేసారని తెలుసుకున్న నారాయణ మూర్తి పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు.. నగదు విత్ డ్రా అయిన పే పాయింట్ కేంద్రం ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించారు.

అనంతరపురం జిల్లాకు చెందిన ఇద్దరు సీఏ విద్యార్ధులు విశాల్, అర్షద్ అకౌంట్లో డబ్బులు స్వాహా చేసినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వెబ్‌సైట్ నుంచి వివరాలు సేకరించి సత్యనారాయణమూర్తి ఖాతా నుంచి రూ.10 వేలు డ్రా చేసినట్లు విచారణలో ఒప్పుకొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగానికి సంబంధించిన వెబ్‌సైట్ నుంచి.. భూములకు సంబంధించిన పత్రాలను విశాల్, అర్షద్ డౌన్‌లోడ్ చేశారు. ఆ పత్రాల్లో నుంచి సత్యన్నారాయణ మూర్తి ఆధార్ కార్డు నంబర్‌ను, అతడి వేలి ముద్రలను సేకరించారు. ఆ రెండింటినీ ఉపయోగించి పే పాయింట్ అనే యాప్ ద్వారా డబ్బు తస్కరించినట్లు నిందితులు వెల్లడించారు.

పే పాయింట్ యాప్ ద్వారా డబ్బు లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం ఉంది. సత్యన్నారాయణమూర్తి వేలిముద్రలను సేకరించి వాటిని కాపీ చేసిన విశాల్, అర్షద్.. ఆ నకిలీ ముద్రల సాయంతో పే పాయింట్‌లో లాగిన్ అయ్యారు. మూడో వ్యక్తి సహకారంతో మూర్తి బ్యాంకు వివరాలు తెలుసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే దీనిపై ఎస్సార్ నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఇలా వేలిముద్రల ద్వారా డబ్బు కొట్టేయడం అంత సులువు కాదని, ప్రజలు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. మూడో వ్యక్తి వారికి సమాచాం అందించడం వల్లే చోరీ సాధ్యమై ఉంటుందని భావిస్తున్నారు. ఆధార్ డేటా సురక్షితమని సర్కారు పదే పదే చెబుతున్నా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆందోళన చెందడం సహజం.

Tags

Read MoreRead Less
Next Story