Chhattisgarh: ఎంత మంచి దొంగలు.. దోచుకున్న సొమ్మును తిరిగి..

Chattisgarah: ఎంతో పగడ్భందీగా, ఎవరికీ దొరక్కుండా దోచుకోవడం కూడా ఒక టాలెంటే.. కష్టపడి దోచుకున్నారు కానీ ఖర్చుపెట్టలేకపోయారు. ఎక్కడ పట్టుపడతామో అని భయపడ్డారు. దోచుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేశారు. మంచి దొంగలుగా పేరు తెచ్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో దొంగలు పట్టుబడతామన్న భయంతో దొంగిలించిన నగదును ఒక్కరోజులోనే తిరిగి ఇచ్చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని బిల్హా ప్రాంతంలో దొంగలు శోభరామ్ కోశాలే నుండి దొంగిలించబడిన నగదును తిరిగి ఇచ్చారు. రోహిత్ యాదవ్‌కు భూమిని విక్రయించిన తర్వాత నగదు రూపంలో వచ్చిన కొంత సొమ్ము రూ. 95,000ను కోశాలే తన ఇంట్లోని బీరువాలో ఉంచాడు. ఆ మర్నాడు చూసుకుంటే అందులో డబ్బులేదు. అయ్యో కష్టపడి సంపాదించిన సొమ్ము ఎవరో దోచుకుపోయారని లబోదిబో మన్నాడు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ఇంట్లో దొంగలు పడి నగదు దోచుకుపోయారని ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతకడం ప్రారంభించారు. విచారణ జరుగుతున్న సమయంలో ఓ విచిత్రం చోటుచేసుకుంది. పోయిన డబ్బు దొరికింది. అది కూడా కోశాలే ఇంటి ప్రాంగణంలోనే ఉంచి వెళ్లారు దొంగలు. ఈ ఘటన కోశాలేతో పాటు పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. దొంగలు ఉద్దేశపూర్వకంగా డబ్బును తిరిగి ఇంట్లోనే వదిలేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. పోలీసుల చేతికి చిక్కితే జైల్లో చిప్ప కూడు తప్పదనుకున్నారో ఏమో అందుకే డబ్బు తిరిగి ఇచ్చి ఉంటారని చుట్టుపక్కల వారు ముచ్చటించుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com