ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్నారా.. అయితే ఒకసారి..

ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్నారా.. అయితే ఒకసారి..
పొరపాటున తప్పు ఫారాన్ని ఎంచుకుంటే మీరు రిటర్ను దాఖలు చేసినా చేయనట్లే అవుతుంది.

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 31. గడువు పూర్తయిన తరువాత దాఖలు చేస్తే ఆదాయాన్ని బట్టి రూ. 10వేల వరకు జరిమానా విధిస్తారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే సబ్‌మిట్ చేయడం మంచిది. రిటర్న్స్ సమర్పించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. సాధారణంగా చేసే చిన్న చిన్న తప్పులు, వాటిని ఎలా నిరోధించాలో తెలుసుకుందాం..

సరైన ఫారాన్ని ఎంపిక చేసుకోవాలి.. ఐటీఆర్ 1 నుంచి 7 వరకు ఫారాలు ఉంటాయి. ఆయా వ్యక్తుల ఆదాయాల తీరును బట్టి సరిపోయే ఫారాన్ని ఎంచుకోవాలి. పొరపాటున తప్పు ఫారాన్ని ఎంచుకుంటే మీరు రిటర్ను దాఖలు చేసినా చేయనట్లే అవుతుంది.

మీ పాన్ నెంబరు, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సాధారణంగా ఫారాన్ని ఎన్నుకోగానే అవన్నీ నింపే ఉంటాయి. మళ్లీ ఒకసారి ఫోన్ నెంబర్ మార్చి ఉంటే దాన్ని ఎంటర్ చేయాలి. అలాగే అడ్రస్ కూడా.

బ్యాంకు ఖాతా వివరాలు కూడా తప్పుల్లేకుండా చూడాలి. రిఫండ్ జమ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎక్కువ మంది చేసే తప్పు ఐఎఫ్ఎసీ కోడ్ సరిగా రాయకపోవడం, అకౌంట్ నెంబర్‌లో కూడా తప్పులు దొర్లే అవకాశం ఉంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి.

యాజమాన్య వివరాలలో తేడా ఉంటే వాస్తవంగా పన్ను చెల్లించినా అది ఐటీ శాఖకు జమకానట్లే అవుతుంది. ఆదాయాలన్నీ అంటే.. అమ్మిన షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లకు సంబంధించి వచ్చిన ఆదాయం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ కూడా లెక్కల్లో చూపించాలి. వీటన్నింటినీ గణించాకే మీ మొత్తం ఆదాయం లెక్క తేలుతుంది.

ఆదాయ లెక్కలతో పాటు, మీరు చేసిన పన్ను మినహాయింపు పెట్టుబడులు, ఖర్చులకు సంబంధించిన వివరాలనూ పేర్కొనాలి. దీనివల్ల మీకు పన్ను భారం తగ్గుతుంది. రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఇందుకు సంబంధించిన పత్రాలన్నీ దగ్గర పెట్టుకోవాలి. చివరిగా రిటర్న్స్ దాఖలు చేసే ముందు ఒకసారి సరిచూసుకోవడం కూడా అంతే ముఖ్యం. బ్యాంకు ఆన్‌లైన్ ఖాతా, ఆధార్ ఓటీపీ ద్వారా రిటర్న్ ఇ-వెరిఫై చేసే అవకాశం ఉంది.

Tags

Next Story