Punjab Elections 2022 : పంజాబ్ లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..

Punjab Elections 2022 :  పంజాబ్ లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..
X
Punjab Elections 2022 : పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజు పోలింగ్‌ జరిగింది.

Punjab Elections 2022 : పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజు పోలింగ్‌ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 63.44 శాతం పోలింగ్‌ నమోదైంది. 1,304 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు.. ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇదిలా ఉంటే.. అన్నిపార్టీలు ఎవరికివారే ధీమాగా ఉన్నారు. గెలుపు మాదంటే మాదంటూ సవాళ్లు విసిరారు. పాటియాలాలో ఓటు హక్కు వినియోగించుకున్న పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌.. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని.. పంజాబ్‌ నుంచి కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.

శిరోమణి అకాలీదళ్‌ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది. బీఎస్పీతో కలిసి పోటీ చేసిన శిరోమణి అకాలీదళ్‌.. తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం ఉందని అంది. ఒకవేళ మెజార్టీ తగ్గితే బీజేపీతో పొత్తుపై ఆలోచన చేస్తామని తెలిపింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. పలుచోట్ల ఆ పార్టీ బూత్‌ క్యాప్చరింగ్‌కు పాల్పడిందని.. అయినా ప్రజలు తమ వైపే నిలిచారని ధీమా వ్యక్తం చేసింది.

అధికార కాంగ్రెస్‌ కూడా ప్రజలు తమ వైపే నిలిచారని చెప్పుకొచ్చింది. పంజాబ్‌ ప్రజలు రెండు తరాలు నష్టపోయారని.. ఒక తరం ఉగ్రవాదానికి.. మరో తరం మాదక ద్రవ్యాలకు బలైపోయిందని.. కాంగ్రెస్‌ నేత సిద్ధూ అన్నారు. పంజాబ్‌ను ప్రేమించే కాంగ్రెస్‌ వైపే ప్రజలు నిలిచారని హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేసింది. మొత్తంగా చెదురుమదురు ఘటనలు మినహా పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పార్టీల ధీమాలు, సవాళ్లు ఎలా ఉన్నా.. ప్రజలు ఎవరి వైపు నిలిచారు అన్నది మార్చి 10న తేలిపోనుంది.

Tags

Next Story