పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ.. యాప్ ద్వారా భర్తీ

ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పోలీసు శాఖలో పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే నెలలో ప్రకటన విడుదలచేసే అవకాశం ఉందని తెలిసింది. ఈసారి నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేక యాప్ రూపొందించాలని పోలీసు నియామక మండలి అధికారులు యోచిస్తున్నారు. తద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని భావిస్తున్నారు.
పోలీసు శాఖలో ప్రస్తుతం 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. పోలీసు నియామక ప్రక్రియ మిగతా ఉద్యోగాల భర్తీ కంటే భిన్నంగా ఉంటుంది. రాత పరీక్షలతో పాటు దేహదారుఢ్య పరీక్షలూ నిర్వహించాలి. అన్నింటిలో ఉత్తీర్ణులై ఎంపికైన వారికి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా నియామక ప్రకటన జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెలాఖరుకల్లా ప్రకటన విడుదల చేయగలిగితే నియామకాలు పూర్తి చేయడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. ఆ పై సంవత్సరకాలం శిక్షణ ఉంటుంది.
నియామక ప్రక్రియ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించే పనిలో ఉన్నారు పోలీసు అధికారులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జరిగే సమయంలో వచ్చే సమస్యలను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థులంతా ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకుని దాని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు దొర్లినా వెంటనే సరిదిద్దుకోవచ్చు. నియామకాలపై మండలి తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా అభ్యర్థులకు చేరవేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణ, అనుమానాల నివృత్తి యాప్ ద్వారా త్వరితగతిన సాధ్యమవుతుందని అధికారులు తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com