Asaduddin Owaisi : ఓవైసీపై కాల్పుల ఘటన కేసులో ఇద్దరు అరెస్ట్

Asaduddin Owaisi : ఓవైసీపై కాల్పుల ఘటన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న అసదుద్దీన్ ఒవైసీపై దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. మీరట్‌లోని కితౌర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని కారులో ఢిల్లీకి వెళ్తుండగా ఫైరింగ్ జరిగింది. మీరట్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న సమయంలో మార్గమధ్యలోని ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అసదుద్దీన్ ఓవైసీ కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో అసదుద్దీన్ కారులోనే ఉన్నారు. మూడు-నాలుగు రౌండ్ల పాటు ఆయన కారుపై కాల్పులు జరిపారు. నిందితులు 9 ఎంఎం పిస్టల్‌ను వినియోగించారని పోలీసులు తెలిపారు.
అసద్ కారుపై కాల్పుల ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విడుదలైంది. ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరపడం స్పష్టంగా కనిపించింది. ఎరుపురంగు హుడీ ధరించిన ఓ యువకుడు తొలుత కాల్పులు జరిపాడు. కారు వైపు వేగంగా దూసుకుని రావడంతో అతను కిందపడటం ఇందులో రికార్డయింది. అదే సమయంలో వైట్ కలర్ షర్ట్ వేసుకున్న మరో వ్యక్తి సైతం కాల్పులకు దిగాడు. టోల్‌ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ సీన్ మొత్తం రికార్డయింది. టోల్ ప్లాజా దాటేటప్పుడు కారు స్లోగా వెళ్తున్న సమయంలో.. పక్కా ప్లాన్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఓవైసీ కారుపై కాల్పులకు పాల్పడిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దుండగుల కోసం గాలింపు కొనసాగుతోందని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఉత్తర ప్రదేశ్ పోలీసులు తెలిపారు.
పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కాల్పులు జరిపారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని లోక్‌సభలో సైతం ప్రస్తావిస్తానని అన్నారు ఓవైసీ. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓ పండగలాంటివని, కాని రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా మట్టుబెట్టే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. దీని వెనుక ఎవరు ఉన్నారనేది దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com