అమ్మ ఒడిలోనే పసి పాప ప్రాణాలు.. ఆస్పత్రిలో వైద్యులు లేక రెండు నెలల చిన్నారి

అమ్మ ఒడిలోనే పసి పాప ప్రాణాలు.. ఆస్పత్రిలో వైద్యులు లేక రెండు నెలల చిన్నారి
వైద్యులు వుండి వుంటే తన బిడ్డ బతికేదని ఆ తల్లి గగ్గోలు పెడుతోంది.

వాళ్లేమీ సెలబ్రెటీలు కాదు.. డాక్టర్లు క్యూ కట్టి వైద్యం చేయడానికి.. ఏజెన్సీ వాసులకి ఏ రోగమొచ్చినా పట్నానికి పయనమవ్వాల్సిందే.. సుస్తీ చేసిన బిడ్డని తీసుకుని అమ్మ ఆస్పత్రికి వెళ్లినా అక్కడ డ్యూటీలో ఉండాల్సిన ఇద్దరు డాక్టర్లూ లేరు. దాంతో సకాలంలో వైద్యం అందక రెండు నెలల చిన్నారి అమ్మ ఒడిలోనే ప్రాణాలు కోల్పోయింది. అయ్యో.. తొమ్మిది నెలలు మోశానే బిడ్డా.. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ అని ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. వైద్యులు వుండి వుంటే తన బిడ్డ బతికేదని ఆ తల్లి గగ్గోలు పెడుతోంది. విశాఖ ఏజెన్సీలోని అనంతగిరి ఆస్పత్రిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

మండలంలోని ఎగువ శోభ పంచాయితీ దిగువ శోభ గ్రామానికి చెందిన కేత ప్రదీప, లక్ష్మి దంపతుల రెండు నెలల చిన్నారికి సుస్తీ చేయడంతో సోమవారం మధ్యాహ్నం అనంతగిరి పీహెచ్‌సీకి తీసుకు వెళ్లారు. ఆ సమయంలో ల్యాబ్ టెక్నీషియన్ తప్ప ఆస్పత్రిలో ఎవరూ లేరు. దీంతో బిడ్డను ఎస్.కోట తీసుకువెళదామనుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో అమ్మ ఒడిలోనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కన్నబిడ్డ తన చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం చూసి తల్లి లక్ష్మి భోరున విలపించింది. వైద్యులు అందుబాటులో ఉంటే తన బిడ్డ బతికేదని కన్నీరు మున్నీరవుతోంది.

అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలూ వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఇద్దరు వైద్యులను నియమించింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయింత్రం నాలుగు గంటల వరకు ఆస్పత్రిలోనే ఉండాలి. ఆ తరువాత కూడా అత్యవసర కేసులు వస్త సత్వరమే సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలి. అందుకోసం స్థానికంగా వారి నివాసం ఉండాలి. కానీ ఇక్కడి ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులూ 85 కి.మీ దూరంలో ఉన్న విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. విధులు హాజరు కానీ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా డాక్టర్‌ను ప్రశ్నించారు. ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి రాలేకపోయానని డాక్టర్ అనూషారావు చెప్పారు. మరో డాక్టర్ సంధ్యారాణి కొత్తూరులో ఆశ కార్యకర్తల పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైనట్లు వివరించారు. ఏదేమైనా సకాలంలో వైద్యం అంది ఉంటే పాప ప్రాణాలతో ఉండేదేమో అన్న ఆశ అమ్మని ఊరుకోనివ్వట్లేదు.

Tags

Read MoreRead Less
Next Story